ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకుని, వారికి షాకులు మీద షాకులు ఇస్తున్న ఏపీ అధికార పార్టీ కి సొంత నేతలే ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ వస్తుండడం ఇబ్బందికరంగా మారింది. వైసీపీ తరపున నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రఘురామకృష్ణంరాజు వ్యవహారం మొన్నటి వరకు హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయనకు షోకాజ్ నోటీసు పార్టీ జారీ చేయడం, దీనిపై ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వైసిపి నాయకులు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాల్సింది గా ఫిర్యాదు చేయడం, ఇలా ఎన్నో జరిగిపోయాయి. తాజాగా విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన పొట్లూరి వరప్రసాద్ ( పి వి పి ) మోదీని కీర్తిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

 

 

చైనాపై బలంగా డిజిటల్ స్ట్రైక్ చేసి దౌత్యం ద్వారా సరిహద్దు నుంచి వెనక్కి నెట్టారని, ఆయన మోదీని మెచ్చుకున్నారు. పార్టీకి కనీసం సమాచారం లేకుండా, ఆకస్మాత్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ని పొగుడుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే పొట్లూరి వరప్రసాద్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనూ ఆయన పై కేసు నమోదైంది. పివిపి తన ఇంటిపై దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని, విక్రమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయింది. అలాగే ఆయనను అరెస్టు చేసేందుకు వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై అతని పెంపుడు కుక్కలను వదిలి నట్లుగా కూడా పీవీపీ పై ఆరోపణలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ వస్తున్నారు.

 

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేక సందేహాలకు తావిస్తోంది." శాంతి సందేశం పంపిస్తున్న చైనా..! హిందీ చీనీ భాయి భాయి అని నెహ్రూ గారి లా మోసపోకుండా, డిజిటల్ స్ట్రైక్ అలాగే దౌత్యం ద్వారా వెనక్కినెట్టి నరద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు'' అంటూ పీవీపీ ఇప్పుడు పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.తనపై నమోదయిన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ఆయన ఇప్పుడు మోడీ భజన మొదలు పెట్టారా లేక రఘురామకృష్ణంరాజు మాదిరిగానే ఆయన బీజపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీలో మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: