ఒక జాగ్రత్త మనిషిని ప్రమాదం నుండి రక్షిస్తే, ఒక నిర్లక్ష్యం ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతుంది.. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు యావత్ ప్రజానీకానికి ప్రమాదంగా మారింది అంటున్నారు విశ్లేషకులు.. ఎందువల్ల అంటే లోకంలో మనుషులకు ఒక చెడ్ద అలవాటు ఉంది.. ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు దానిపై ఉన్నంత శ్రద్ధ కొన్ని రోజుల తర్వాత ఉండదు.. ఇది వస్తువు విషయంలో అయినా, మానవ సంబంధాల విషయంలో అయినా వర్తిస్తుంది.. ఎందుకంటే కరోనా కేసులు మన దేశంలో నమోదైన తొలినాళ్లలో.. ఆ రోగిపట్ల ఎంత బాధ్యతగా మెలిగారో ఒక్క సారి గుర్తు చేసుకోండి..

 

 

ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, వ్యక్తి ఇంటికి, వైద్యసిబ్బంది పీపీఈ కిట్లు వేసుకొని, అంబులెన్స్‌లో దిగేవారు. వీరికి తోడుగా ఇద్దరు పోలీసులు కూడా వచ్చేవారు. అంతే కాకుండా ఆరోగ్య సిబ్బంది ఆ ప్రాంతాన్ని శానిటైజ్‌ చేయించి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడమే కాకుండా, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పట్ల అత్యంత శ్రద్ధ వహించడంతో పాటుగా, అతన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించి, నెగెటివ్‌ వచ్చాకే ఇంటికి పంపించేవారు. కానీ ఇప్పుడో... ఒక్కో ఇంట్లో అరడజను కేసులొచ్చినా ఎలాంటి అప్రమత్తత ఉండటం లేదు.

 

 

ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి మాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని అనుమానంగా ఉందంటే, ఆస్పత్రికి రండి అనే సమాధానం వినిపిస్తుంది.. ఇక కరోనా ఉన్న వ్యక్తి ఆటోలోనో, సొంత వాహనంలోనో ఆస్పత్రికి వెళ్లేలోపు అతను ఎక్కడైనా తిరగొచ్చు, ఎంతమందిని అయినా కలవచ్చు. అదీగాక ఆ వ్యక్తితో ఉన్న కాంటాక్ట్‌లను పసిగట్టడం మానేశారు.. డజన్ల కొద్దీ కేసులు వచ్చి, మరణాలు సంభవించిన ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేయడం దాదాపుగా మర్చిపోయారు. ఎవరైనా ఒత్తిడి చేస్తే సిబ్బంది వచ్చి బ్లీచింగ్‌, సున్నం చల్లుతున్నారు తప్పితే మరే చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి.

 

 

ఇకపోతే ఇప్పుడు కరోనా వచ్చినా వారిని ఏకంగా ఆస్పత్రికి కూడా రానక్కర్లేకుండా, ఇంట్లో ఉంటే చాలు అని తేల్చేస్తున్నారు. ఈ వైరస్ మొదట్లో ఒక కేసు వస్తే వీధివీధంతా మూత, కానీ ఇప్పుడు ఇరుగింట్లో, పొరుగింట్లో కరోనా వచ్చినా తెలియని దుస్దితి.. మొదట్లో ఉన్న స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌ ఇప్పుడు లేదు. మరో వైపు ఆస్పత్రులు నిండిపోతున్నాయనే నెపంతో డిశ్చార్జిలపైనే దృష్టిపెట్టారు. నిజాన్ని పచ్చిగా చెప్పాలంటే మీ చావు మీరు చావండి అని చెతులెత్తేసారు..

 

 

దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే కరోనా అనే టాస్క్ ప్రజల ముందు ఉంది.. దీని నుండి తప్పించుకున్న వారు బ్రతుకుతారు, ఈ వైరస్ నోట్లో పడ్డవారు చస్తే చస్తారు, లేదా ఎందుకు బ్రతికాం దేవుడా అని విరక్తి చెందుతారు.. ఇది ప్రస్తుతం అమలవుతున్న విధానం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: