ఆల్మట్టి ఎత్తు పెంచి... తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం మిగిల్చిన కర్ణాటక మరోసారి అదే ఎత్తుగడకు దిగుతోంది. కృష్ణా జలాలు మొత్తం తానే ఉపయోగించుకునే కుట్రలకు తెరతీసింది. కేంద్రంలోనూ, కర్ణాటకలోనూ తామే అధికారంలో ఉన్నామన్న ధీమాతో....ఆల్మట్టి ఎత్తును మరోసారి ఐదు మీటర్ల పెంచే వ్యూహంతో ముందుకు కదులుతోంది. ఇదే జరిగితే  ఏపీ,తెలంగాణ కృష్ణా ఆయకట్టు ప్రాంతాలు ఎడారిగా మారినట్టే. ప్రస్తుతం 519.6 మీటర్ల ఎత్తులో ఉన్న ఆల్మట్టిని, 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని కర్నాటక నిర్ణయించింది. ప్రాజెక్టు ఎత్తు పెంచితే 20 గ్రామాలు ముంపుకు గురవుతాయని భావిస్తున్న కర్నాటక....వారికి పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 61వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని కోరింది. కర్నాటక ప్రతిపాదనపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు మండిపడుతున్నారు. 

 

ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ప్రాజెక్టు ఎత్తు ఐదు మీటర్లు పెంచితే కర్నాటక మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే వీలుంటుంది. దీనివల్ల దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు సాగునీరే కాదు...తాగునీరు సైతం అందని ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్మట్టి ఎత్తు పెరిగితే..కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరైన సమయంలో సాగునీరు అందే అవకాశం లేదు. ఏటా కర్నాటకలోని ప్రాజెక్టులు నిండగానే.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా జలాలు తెలుగు  రాష్ట్రాలకు విడుదలవుతాయి. అయినప్పటికీ...శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు ఐదారేళ్లకోసారి గానీ నిండడం లేదు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచితే ఇక కృష్ణా జలాలు అక్టోబరు, నవంబర్ దాకా తెలుగు రాష్ట్రాలను చేరవు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి పంటలకు నీరందించే పరిస్థితి ఉండదు. ఇది తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముంది. 130 టీఎంసీల కృష్ణా జలాలను కర్నాటక అదనంగా ఉపయోగించుకుంటే...ఇక తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాల మాటే ఉండదు. 

 

ఆల్మటి ఎత్తు పెరిగితే..మిగులు జలాలపై ఆధారపడి తెలంగాణ నిర్మించిన, నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులు నిరుపయోగంగా మారతాయి. నెట్టెంపాడు, భీమా, డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందనట్టే. గతంలో ఆల్మట్టి ఎత్తు పెంపుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యుల్ అనుమతించడంపై 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టే తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 2014 జులైలో రిట్ పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆల్మట్టి పెంపుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే...అది కోర్టు ధిక్కారం అవుతుందని, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: