ఇండియా, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. 3 కిలోమీటర్ల బఫర్ జోన్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సరిహద్దుల్లో అప్రమత్తత కొనసాగిస్తున్నట్టు భారత్ సైన్యం ప్రకటించింది. 

 

లడఖ్ లో సైనిక ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. 2 నెలల పాటు తీవ్ర ప్రతిష్టంభనకు కేంద్ర బిందువులుగా ఉన్న హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి భారత్‌, చైనాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ ఉపసంహరణను సోమవారం ప్రారంభించిన డ్రాగన్‌.. మంగళవారమూ కొనసాగించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీల మధ్య చర్చల తర్వాత... లడఖ్ లో బలగాలు ఉపసంహరించుకోవాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయి.  

 

చైనా ఉపసంహరణలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. అదే సమయంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వీలుగా అత్యున్నత స్థాయిలో అప్రమత్తతను కొనసాగిస్తోంది. గత నెల 30న జరిగిన రెండు దేశాల కోర్‌ కమాండర్ల చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల మధ్య 3 కిలోమీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

 

గాల్వన్ లో చైనా తన సైన్యాన్ని రెండు కిలోమీటర్ల మేర వెనక్కి రప్పించింది. అక్కడి పెట్రోలింగ్‌ పాయింట్‌-14 వద్ద తన శిబిరాలను తొలగించింది. 8 వారాలుగా హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ ఇరు దేశాలు రెండు రోజుల్లో సైనిక ఉపసంహరణను పూర్తి చేసే అవకాశం ఉంది. హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో డ్రాగన్‌ బలగాలు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గుతాయి. హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, గాల్వన్‌ ప్రాంతాల్లో భారత్‌ కూడా కొంత దూరం వెనక్కి మళ్లింది. 

 

అయితే పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాలను చైనా పెద్దగా ఉపసంహరించుకోలేదు. భారత సైన్యం గస్తీ తిరిగే ప్రాంతాల్లో చైనా దాదాపు 190 నిర్మాణాలను చేపట్టింది. కొద్దిరోజుల్లో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగే నాటికి.. చైనా వెనక్కి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు భారత్ సైనిక వర్గాలు తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: