గాంధీ కుటుంబ ట్రస్టులు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలపై కేంద్రం విచారణకు ఆదేశించింది. దీనిపై కేంద్ర హోం శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే చైనాతో వివాదాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక.. ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి ఎంక్వైరీలు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 

 

రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లకు వచ్చిన నిధులపై కేంద్రం విచారణకు ఆదేశించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్, విదేశీ నిధుల రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి.  దీంతో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటు చేస్తూ హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈడీ స్పెషల్ డైరక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. 

 

సోనియాగాంధీ నేతృత్వంలోని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ కు అందిన విరాళాలపై పలు ఆరోపణలు వచ్చాయి. చైనా కమ్యూనిస్టు పార్టీతో పాటు ప్రధాని సహాయ నిధి నుంచి కూడా విరాళాలు రావడంపై బీజేపీ పలు ఆరోపణలు చేసింది. దీంతో శత్రుదేశమైన చైనా నుంచి, పేదల కోసం ఉద్దేశించిన పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఎలా బదిలీ చేస్తారని నిలదీసింది. ఈ విరాళాలపై కాంగ్రెస్ పార్టీ విరాళాలివ్వాలని కాషాయ పార్టీ డిమాండ్ చేస్తోంది. 

 

మరోవైపు 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలు చెప్పడానికి కాంగ్రెస్ నిరాకరించింది.  20 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్న చైనాను విమర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇష్టపడకపోవడానికి..-విరాళాలు, ఎంఓయూ, నెహ్రూ-గాంధీ  కుటుంబానికి చైనా చేసే రాచమర్యాదలే కారణమై ఉండొచ్చని బీజేపీ విరుచుకుపడింది. 

 

రాజీవ్ మరణం తర్వాత 1991లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఏర్పాటైంది. 2002లో రాజీవ్ గాంధీ ట్రస్ట్ ఏర్పాటైంది. దీంతో పాటు ఇందిరాగాంధీ ట్రస్ట్ కూడా ఉంది. ఈ మూడు సంస్థలూ గాంధీ కుటుంబ సంస్థలుగా చెలామణీ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ట్రస్ట్ సభ్యులుగా సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. ప్రస్తుతం సోనియా, రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేస్ కోర్టులో నడుస్తోంది. ఇటీవలే ప్రియాంక గాంధీకి ఇచ్చిన ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసిచ్చిన కేంద్రం.. ఇప్పుడు గాంధీ కుటుంబ సంస్థలపై విచారణకు ఆదేశించడం కక్ష సాధింపే అంటోంది కాంగ్రెస్. 

 

చైనా వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అయితే 1991 బడ్జెట్ స్పీచ్ లోనే అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు వంద కోట్లు కేటాయించారని బీజేపీ గుర్తుచేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: