ఈ ఏడాది ప్ర‌థమార్థంలో తెలంగాణ ఆర్టీసీ గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన ఓ మాట గుర్తుండే ఉంటుంది. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి ఆర్టీసీ లాభాల్లోకి వ‌స్తుంది. మీ అంద‌రికీ నేను బోన‌స్‌‌లు ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆర్టీసీలో సీన్ మారిపోతోంది. కార్మికుల సమ్మె అనంత‌రం ఆర్టీసీకి బ్యాడ్ టైం కొన‌సాగుతోంది. లాక్‌‌‌‌డౌన్‌, డీజిల్ ధరల పెంపు వంటి సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో భారీ నష్టాలే వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. మొదట్లో కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడవలేదు. ఆ తర్వాత కుదురుకుంటుందనగానే కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో లాక్‌‌‌‌డౌన్ ప్రకటించడంతో సుమారు 58 రోజుల పాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. మే 19న లాక్ డౌన్‌ సడలించడంతో బస్సుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజుల్లో ప్రయాణికుల రద్దీ తక్కువగానే ఉన్నా తర్వాత క్రమంగా పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం కరోనా పట్టణాలు, పల్లెలకు పాకడంతో స్వీయ లాక్‌‌‌‌డౌన్‌లు విధించుకుంటున్నారు. దీంతో బస్సెక్కే వారే కనిపించడం లేదు. దీనికి తోడు డీజిల్ ధరలు కూడా పెరిగిపోతుండడంతో నష్టం మరింత పెరిగింది. 

 

లాక్‌డౌన్ ‌‌‌‌రూల్స్ సడలించిన త‌ర్వాత ఆర్టీసీకి ఆదాయం రాక మొద‌లైంది. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. ఆషాఢ మాసం ప్రారంభమైన వారం, పది రోజుల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగింది. అయితే, కొద్దిరోజుల నుంచి పట్టణాలు, పల్లెల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆర్టీసీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు తగ్గించారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో  పడిపోయింది. గత 10 రోజుల నుంచైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ‌‌‌‌విధిస్తారని ప్రచారం జరగడం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. హైదరాబాద్‌లోని బేగంబజార్, గంజ్ వంటి పెద్దపెద్ద మార్కెట్లు బంద్ కావడంతో జిల్లాల‌ నుంచి రాకపోకలు తగ్గాయి.

 

మ‌రోవైపు ఆయా జిల్లాల్లో పట్టణాలు, పల్లెల్లో కూడా కేసులు పెరిగి పోతున్నాయి. దీంతో వ్యాపారులు స్వీయ లాక్‌డౌన్ ‌‌‌‌అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. దీనికి తోడు డీజిల్ ధరల రూపంలో ఆర్టీసీకి మ‌రో షాక్ త‌గిలింది. డీజీల్ ధ‌ర‌ల‌ పెంపుతో ఆర్టీసీ కోలుకోలేని దెబ్బ తగిలింది. మొత్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్క ఆర్టీసీ విష‌యంలో ఫెయిల‌యింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: