మనిషి జీవితం పూర్తిగా కాలం మీద ఆధారపడి ఉంటుంది. తనకు తెలియకుండానే కాలప్రవాహంలో అలా కొట్టుకుపోతూంటాడు. ఇక ఘడియ గడిస్తే చాలు ఆయువు తగ్గుతుంది. గమ్యానికి పయనం చేరువ అవుతుంది. అంటే కాలచక్రం మనిషి జీవితాన్ని ఎంతగా నియంత్రిస్తుందో అర్ధమవుతోందికదా.

 

అటువంటి మనిషి జీవితంలో ప్రతీ నిముషమూ విలువైనదే. సామాన్యుడి నుంచి గొప్పవారి వరకూ ప్రతీ ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి. కనీసం పొట్టపోసుకోవడానికైనా ఆలోచనా చేయాల్సిందే. అపుడు ఈ కాలం ప్రతీ వారికి ఎంతగానే ఉపయోగపడుతుంది.ఒక రోజు గడిస్తే వెనక్కు తీసుకురాలేం.

 

అలాంటిది కరోనా పుణ్యమాని ఈ ఏడాది మార్చి నుంచి విలువైన కాలమంతా ఖాళీగా ఖర్చు అయిపోతోంది. ఈ ఏడాదిలో కూడా వ్యాక్సిన్ రాదని అంటున్నారు. అంటే 2020లో తొమ్మిది నెలల పాటు కరోనా కాటుకు కాలం పూర్తిగా ఖతం అయిపోయినట్లే. సరే 2021లోనైనా ఈ మహమ్మారి నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంటే 2021లో మరింతగా కరోనా విలయతాండవం చేస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.

 

2021 ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మందికి కరోనా సోకుతుంది అంటున్నారు. అందులో అగ్ర తాంబూలం భారత్ దేనట. అమెరికాలోని మస్సాచుసెట్స్   ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనకర్తలు వెల్లడిస్తున్నారు. పరిశోధకులు హజీర్ రెహ్మాందాద్, టీవై లిమ్, జాన్ స్టెర్ మెన్ చేసిన ఈ పరిశోధ‌నలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.

 

ప్రస్తుతం రోజుకు పాతిక వేల కేసులతోనే బెంబేలెత్తుతున్న భారత్ ఫిబ్రవరి నాటికి రోజుకు దాదాపు మూడు లక్షల కేసులతో అల్లలాడిపోతుందని కూడా అంటున్నారు. ఇక ప్రపంచంలోని 60 కోట్ల కేసుల్లో భారత్ వాటావే ఎక్కువ అని కూడా అంటున్నారు. అదే విధంగా అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, రష్యా వంటి దేశాలు కరోనా కోరల్లో చిక్కుతాయని అంటున్నారు.

 

దీనిని బట్టి చూస్తూంటే కరోనాతో 2021 కూడా హారతికర్పూరం అయ్యేలా ఉందని అర్ధమవుతోంది. ఈ లోగా భగవంతుడి దయ వల్ల వ్యాక్సిన్ దొరికితే కరోనా కట్టడి అవుతుంది తప్ప లేకపోతే కరోనాను ఆపడం ఎవరితరం కాదని తేలిపోతోంది. మరి ఈ పరిణామాలు సహజంగానే మానవాళిని వణికించేవే. అయినా ఇది ప్రక్రుతి విపత్తు. దానికి పరిష్కారం దొరికేంత వరకూ ఎవరూ చేసేది ఏమీ లేదు కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: