ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని సొమ్ము చేసుకునేందుకు....ఇక్క‌డ అక్క‌డ అనే తేడా లేకుండా ...ఈ మ‌తం, ఆ మ‌తం అనే సంబంధం లేకుండా దేశ‌వ్యాప్తంగా కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద ఆశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి వాటిలో త‌ప్పుడు ప‌నులు కూడా చేస్తున్నార‌నే ఆరోపణ‌‌లు, సంఘ‌ట‌న‌లు అనేకం తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఆశారామ్ బాపు, రామ్ రహీమ్, వీరేంద్ర దీక్షిత్ వంటి వివిధ బాబాలు నడుపుతున్న బాగోతాలు ఎన్నో క‌ల‌క‌లం వ‌చ్చాయి. అత్యాచార కేసుల్లో నిందితుడైన  వీరేంద్ర దీక్షిత్ స్థాపించిన ఢిల్లీ రోహిణిలోని  ఆధ్యాత్మిక విద్యాలయం గురించి తాజాగా ఓ సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. 

 

 

ఇటీవ‌లే నిత్యానంద చేతిలో ఇరుక్కుపోయిన ఇద్ద‌రు ఆడ‌బిడ్డ‌ల ఉదంతం తెర‌మ‌రుగు కాకముందే, మ‌న తెలుగు వ్య‌క్తి ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌కు చెందిన దుంప‌ల రాంరెడ్డి అనే వ్య‌క్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసిన ఓ పిటిష‌న్ చూస్తే మోసాల‌తో సామాన్యులు ఎంతగా వీరి ప్ర‌భావానికి గుర‌వుతున్నారో అర్థ‌మ‌వుతుంది. వీరేంద్ర దీక్షిత్ స్థాపించిన ఢిల్లీ రోహిణిలోని  ఆధ్యాత్మిక విద్యాలయంలో తన కుమార్తె సంతోషి చిక్కుకుంద‌ని కోర్టుకు విన్న‌వించుకున్నాడు. త‌న బిడ్డ‌ను విడిపించాల‌ని కోరుకున్నాడు. వీరేంద్ర దీక్షిత్ మూడేళ్లు పరారీలో ఉన్నాడని.. కానీ, అతని ఆశ్రమం యథావిధిగా నడుస్తుందని కోర్టు ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇదే స‌మ‌యంలో దేశంలో అక్రమ డబ్బుతో బోగస్ ఆశ్రమాలు నడుస్తున్నాయని 17 ఆశ్రమాలలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టు దృష్టికి పిటిష‌న‌ర్‌ తీసుకెళ్లారు.  దొంగ బాబాల ఆశ్రమాలలో  పరిశుభ్రమైన పరిస్థితులు లేవని, జైళ్లను తలపించేలా ఉన్నాయని...  ఆ ఆశ్రమాలలో ఉన్నవారికి క‌రోనా వైర‌స్‌  వ్యాపించవచ్చని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే 17 ఆశ్రమాలను బోగస్ ఆశ్రమాలుగా ప్ర‌క‌టించింద‌ని పేర్కొంటూ బోగస్ ఆశ్రమాలపై నియంత్రణ ఉండాలని కోరాడు.

 

 

పిటిషనర్ లేవనెత్తిన ప‌లు అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆశ్రమాలు నియంత్రణ లేకుండా నడుస్తున్నాయి, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని అభిప్రాయ‌పడ్డారు. దేశంలో బోగస్ బాబాలు నిర్వహిస్తున్న బోగస్ ఆశ్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రెండు వారాల్లో తెలపాలని  సొలిసిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఈ సంఘ‌ట‌న భ‌క్తి ముసుగులో ఎలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయో మ‌రోమారు తెలియ‌జెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: