ఉమ్మడి రాష్ట్రంలో మాస్ లీడర్ గా, కాంగ్రెస్ కు జవసత్వాలు తెచ్చిన నేతగా ప్రసిద్ధి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు పక్షపాతిగా అందరికీ గుర్తుండిపోతారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించిన వైఎస్సార్.. సమాజంలో ప్రతి వర్గానికి చేరేలా పథకాలు రూపొందించారు. రాజకీయ జీవితమంతా ప్రజలతోనే మమేకమైన వైఎస్.. మహానేతగా పేరు తెచ్చుకున్నారు.

 

యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి .. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధత్యలు స్వీకరించి.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.. ప్రజలకు గుండె చప్పుడు అయ్యారు. పథకాల విషయానికి వస్తే ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలే ఉన్నాయి. ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.. ప్రశంసలు అందుకున్నాయి.. అందుకుంటూనే ఉన్నాయి. 

 

ఆరోగ్య శ్రీ పథకం పేరు చెప్పగానే కచ్చితంగా ఎవరికైనా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తు వస్తారు. స్వతహాగా డాక్టర్ అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం. తన పాదయాత్ర అనుభవాలు, తర్వాత తనకు ఎదురైన సంఘటనలతో చలించిపోయి.. వైద్యం అందక ఆగిపోతున్న పేదవాడి గుండెకు ఊపిరి పోసేలా ఆరోగ్య శ్రీని అమలు చేశారు. ఈ పథకం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటూ ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నో లక్షల ప్రాణాలను నిలబెట్టిన ఘనత వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీకి దక్కుతుందనే చెప్పాలి. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ వైఎస్సార్‌ను ఓ దేవుడిలా కొలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

 

108 వాహనాల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కుయ్, కుయ్ అంటూ వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆస్పత్రులకు చేర్చడంలో 108ది కీలక పాత్ర. ఎవరైనా ప్రమాదంలో గాయపడినా, అనారోగ్యం పాలైనా.. సరైన వాహన సదుపాయాలు లేక సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక ఎన్నో ప్రాణాలు పోయాయి. ఇలా ఎంతోమంది పేదలు సమయానికి వైద్యం అందక చనిపోయిన ఘటనలు ప్రత్యక్షంగా చూసి 108లను పరిచయం చేశారు. ఈ వాహనాల తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు పరిచయం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చారు. ఇది కూడా వైఎస్ మానసపుత్రికగా చెప్పాలి.

 

రైతు రుణమాఫీని తీసుకొచ్చిన ఘనత కూడా వైఎస్‌కు దక్కుతుంది. గతంలో పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాక, బ్యాంకులకు వడ్డీలు, రుణాలు చెల్లించలే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఆపద్భాందవుడిలా రుణమాఫీని ప్రవేశపెట్టారు వైఎస్. అర్హులైన రైతులకు రుణాలు మాఫీ చేసి విముక్తి కల్పించారు. అంతేకాదు పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యుత్ బకాయిల్ని కూడా మాఫీ చేశారు.. అలాగే సున్నా వడ్డీ రుణాలను కూడా రైతులకు అందించిన ఘనత ఆ మహానేతకు దక్కింది. ఆయన స్ఫూర్తితోనే చాలా రాష్ట్రాలు రైతు రుణమాఫీలు చేశాయి.. అన్నదాతలకు అండగా నిలిచాయి. అందుకే వైఎస్ రైతు భాందవుడిగా ఇప్పటికీ నిలిచిపోయారు. ఆయన జయంతి రోజును రైతు దినోత్సవంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

ఉచిత కరెంట్ పథకం కూడా వైఎస్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. పాదయాత్ర సమయంలో రైతుల కష్టాలను చూసి ఉచిత కరెంట్ హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకం ఈ ఉచిత కరెంట్ ఫైల్ మీదే పెట్టారు. ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా రైతులకు ఉచిత కరెంట్ అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది.. వైఎస్ ఆలోచనను ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేశాయి. ఇప్పటికీ ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది.. ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది.

 

వైఎస్ తీసుకొచ్చిన అద్భుతమైన పథకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో పథకం ఫీజు రీయింబర్స్‌‌మెంట్. ఒకప్పుడు ఉన్నత చదువులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారేవి. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబీవీఎస్ వంటి కోర్సులు అందని ద్రాక్షలా ఉండేవి. చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ వెంటనే విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువులు ఆపేసిన విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా మళ్లీ చదువుకున్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతోంది.

 

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలో నుంచి వచ్చిన మరో మాసపుత్రిక జలయజ్ఞం. అన్నదాతల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా పొలాలకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో జలయజ్ఞం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యతా క్రమంలో కొత్త ప్రాజెక్టుల్ని, ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.. అనతికాలంలోనే కొన్నింటిని పూర్తి చేశారు. ప్రతిపక్షాల నుంచి జలయజ్ఞం.. ధనయజ్ఞం అంటూ విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ముందుకు సాగారు. 

 

పేదవాడికి బుక్కెడు తిండి కరువై ఆకలి బాధతో పస్తులు ఉండకుండా 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఎన్టీఆర్ హయాంలో అమలైన ఈ పథకం తర్వాత కాస్త నెమ్మదించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఈ పథకాన్ని అమలు చేశారు. 2 రూపాయలకే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించారు. ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాల కడుపు నింపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: