తెలంగాణలోని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలోని నెటిజ‌న్ల‌ను సైతం స్పందించేలా చేస్తున్న అంశం స‌చివాల‌య కూల్చివేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాడ గురించి. ముఖ్య‌మంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని ఇర‌కాటంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రెండు విష‌యాల్లో ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. ఇటు సోష‌ల్ మీడియాలోనూ అటు ప్రధాన స్ర‌వంతి మీడియాలోనూ ఆయ‌న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తు‌న్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ సైతం అవ‌కాశం దొరికిన‌ప్పుడల్లా తెలంగాణ సీఎంను, స‌చివాల‌యం కూల్చివేత‌ను త‌ప్పుప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మౌనం ఆస‌క్తిని రేకెత్తిస్తుంటే...టీఆర్ఎస్ పార్టీ యువ‌నేతగా పేరొందిన కేటీఆర్ సైతం స్పందించ‌క‌పోవ‌డం విప‌క్షాల‌కు అస్త్రంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత గురించి ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లను ప‌లువురు మంత్రులు తిప్పికొట్టారు. స‌చివాల‌యం నిర్మాణానికి అడ్డువ‌చ్చే వారిని అరెస్టు చేసి లోప‌ల వేస్తామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఒకింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ క‌రోనా కంటే డేంజ‌ర్ అని మ‌రో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. సెక్ష‌న్ 8 అమ‌లు చేయాల‌నే త‌ప్పుడు డిమాండ్‌ను తెర‌మీద‌కు తెస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ఇక యువ‌ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ, పాత సచివాలయం బాగా పాడుప‌డింద‌ని పేర్కొంటూ అయినా అందులోనే సంసారం చేయాలా అని ప్ర‌శ్నించారు. సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డట్టేన‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్షాలు చేసే వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడుంటే ఏమిటీ? సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ అమరావతిలో ఉందా? ఇప్పుడు ఏ పథకమైనా ఆగిందా? అని ప్ర‌శ్నిస్తూ కేసీఆర్‌ది బలమైన గుండె కాయ అని అన్నారు. ఆయ‌న విష‌యంలో ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని ప్ర‌క‌టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వివిధ సంద‌ర్భాల్లో మౌనం దాల్చ‌డం ఆయ‌న రాజ‌కీయ వ్యూహాల్లో భాగ‌మ‌నే విష‌యం నిజ‌మైన‌ప్ప‌టికీ... విప‌క్షాల విమ‌ర్శ‌ల విష‌యంలో కేటీఆర్ క్లారిటీ ఇస్తే బాగుండేద‌ని అంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల‌కు సైతం ఆయ‌న క్లారిటీ స్ప‌ష్ట‌త ఇచ్చేలా ఉండేంద‌ని పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: