2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది టీడీపీ నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు టీడీపీ నేతలు కంటికి కనిపించడం లేదు. అయితే ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే కొందరు బీజేపీలోకి వెళ్లారు. కానీ కొంతమంది మాత్రం నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండటమే మానేశారు. ఈ జగన్ వేవ్‌లో ప్రస్తుతం నెట్టుకురావడం కష్టమని చెప్పి, సైలెంట్ అయిపోయారు.

 

అయితే ఎన్నికలై ఏడాది దాటినా కూడా కొందరు నేతలు బయటకు రాకపోవడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని చోట్ల నాయకులని మార్చడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త ‌ఇన్‌చార్జ్‌లని నియమించారు. అలాగే నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా లేని నేతలని పీకి పక్కనబెట్టి కొత్త నాయకులని పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గం పామర్రులో కొత్త నాయకత్వం రానుందని తెలుస్తోంది.

 

పామర్రు నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. ఇక ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి డి‌వై దాస్, టీడీపీ నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పనపై విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో కల్పన వైసీపీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్యపై కేవలం వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతో గెలిచారు. అయితే కల్పన ఆ తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. 2019 ఎన్నికల్లో ఆమె టీడీపీ నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్ధి కైలా అనిల్ కుమార్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.

 

అసలు ఓడిపోయిన దగ్గర నుంచి కల్పన నియోజకవర్గంలో పార్టీని పట్టించుకోవడం లేదు. అసలు కార్యకర్తలని కలుస్తూ...పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్దగా చేయడం లేదు. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ కేడర్ కల్పన నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆమెని పక్కనబెట్టి మళ్ళీ వర్ల రామయ్యకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని, పామర్రు తమ్ముళ్ళు కోరుతున్నారు. ఇక చంద్రబాబు కూడా ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టి, నాయకత్వం మార్చే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: