నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడనుందా? లోక్‌సభ స్పీకర్ వైసీపీ ఫిర్యాదుకు స్పందించి, ఎంపీపై వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ వేటు పడితే నరసాపురం పార్లమెంట్‌కు ఉపఎన్నికలు రానున్నాయా? అంటే ఇందులో ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేమనే చెప్పొచ్చు. బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న రఘుపై వేటు పడటం అంత సులువైన పని కాదు.

 

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి, రఘుపై వేటు వేయాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక రివర్స్‌లో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన పార్టీ ఏంటో తెలిసే వరకు అనర్హత వేటు వేయకుండా  ఆపాలని రఘు కోర్టుకు వెళ్లారు. ఇక ఈ విషయాలన్నీ పెండింగ్‌లో ఉండగానే, రఘుపై వేటు పడటం ఖాయమని వైసీపీ శ్రేణుల్లో ప్రచారం నడుస్తోంది. బీజేపీకి వైసీపీ రాజ్యసభ సభ్యులతో అవసరముంది కాబట్టి, స్పీకర్ రఘుపై అనర్హత వేటు వేస్తారని అంటున్నారు. పైగా నరసాపురంలో ఉపఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ ఎంపీలు బహిరంగంగానే చెబుతున్నారు.

 

ఇక ఎంపీలు చెప్పినట్లు జరిగితే నరసాపురం పార్లమెంట్‌కు ఉపఎన్నికలు రావడం ఖాయం. అయితే అప్పుడు రఘు బీజేపీ-జనసేన పొత్తులో కలిసి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. కానీ పొత్తులో పోటీ చేసినా సరే రఘు విజయం సాధ్యం కాదని, ఆయనకు చంద్రబాబు మద్ధతు కావాల్సి వస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌లో టీడీపీ అభ్యర్ధి శివరామరాజుకు దాదాపు 4 లక్షల 15 వేలు ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన రఘు 4 లక్షల 47 వేల ఓట్లు తెచ్చుకుని దాదాపు 32 వేల మెజారిటీతో గెలిచారు.

 

అలాగే జనసేన నుంచి పోటీ చేసి నాగబాబు 2 లక్షల 50 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇక దీని బట్టి చూసుకుంటే రఘు...జనసేన-బీజేపీ పొత్తులో పోటీ చేసిన గెలవడం కష్టం. అదే టీడీపీ సపోర్ట్ ఇస్తే విజయం సులువే. మొత్తానికైతే నరసాపురం పార్లమెంట్‌కు ఉపఎన్నికలు వస్తే రఘు భవిష్యత్ బాబు చేతిలో ఉన్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: