వైఎస్ రాజకీయ జీవితం పూలపాన్పు కాదు. మూడు దశాబ్దాల పాటు అసమ్మతి నేతగా ముద్రపడి.. చివరకు చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరిగా పరిగణించే స్థాయి నుంచి ఆయనే సీఎం అనేంతగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడంలో వైఎస్ కష్టం అంతా ఇంతా కాదు. 

 

1949లో కడప జిల్లాలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డి.. డాక్టర్‌ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడైన ఆయన ఎస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వైద్యుడిగా పలుచోట్ల పని చేసిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1980-82లో గ్రామాభివృద్ధి శాఖా మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖా మంత్రిగా, 1982-83 కాలంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేసి అయా మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేశారు. అంతేకాదు ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.

 

ఇక 1983,1985ల్లోనూ పులివెందుల నుంచి గెలుపొందిన వైఎస్ .. అప్పట్లో ఏపీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో వైఎస్ వాక్‌చాతుర్యం, నాయకత్వ లక్షణాలను మెచ్చిన అప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆయనకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. ఆ తరువాత కడప నియోజకవర్గానికి జరిగిన 9,10,11,12వ లోక్ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన వైఎస్, 1999లో మళ్లీ పులివెందుల అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు నడిపించడం వైఎస్ వల్లే సాధ్యమైంది. ఇక ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలానైనా తీసుకురావాలని సంకల్పించిన ఆయన.. 2003 వేసవికాలంలో పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 1,467కి.మీలు పాదయాత్ర చేసిన ఆయన.. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎంతోమంది అభిమానం చూరగొన్న ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. ఓటమెరుగని నేతగా ఉన్నా.. బలమైన నేతగా అధిష్ఠానం దృష్టిలో పడ్డా.. సీఎం పదవి కోసం మాత్రం వైఎస్ మూడు దశాబ్దాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి కాంగ్రెస్ లో ఎన్నో గ్రూపులున్నాయి. కానీ అన్ని గ్రూపుల్ని సంతృప్తి పరుస్తూ.. అందర్నీ ఒక్కతాటిపై నడిపిన ఘనత వైఎస్ సొంతం. వైఎస్ పై భరోసాతో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఆయనకే వదిలేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ ప్రజల కోసమే పాటుపడిన వైఎస్.. ఏ నిర్ణయం తీసుకున్నా.. తరతమ భేదాలకు తావులేకుండా పనిచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా.. ప్రజలందరూ ఒకటే అనే భావనతో ప్రభుత్వాన్ని నడిపించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు పథకాల లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తే.. బహిరంగ వేదికల మీదనే వైఎస్ వారిని మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ కారణంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన సాలిడ్ ఓటు బ్యాంకు కూడా కొంత కాంగ్రెస్ వైపు మళ్లిందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ సాలిడ్ ఓట్ బ్యాంకుకు తోడు.. వైఎస్ ప్రజాకర్షణతో తెచ్చిన ఓటుబ్యాంకు తోడవడంతో... ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికార పీఠం నిలబెట్టుకోగలిగింది. 

 

సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. అభివృద్ధి విషయంలోనూ తనదైన ముద్ర వేశారు వైఎస్. హైదరాబాద్ కు మణిహారంగా చెప్పుకునే మెట్రో ప్రాజెక్టు పనులు ఆయన హయాంలోనే మొదలయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కూడా అప్పుడే పూర్తైంది. అవుటర్ రింగ్ రోడ్డుకు ఓ రూపు తీసుకొచ్చింది కూడా వైఎస్సే. హైదరాబాద్ లో ఐటీ రంగం బహుముఖంగా విస్తరింరచడానికి కూడా వైఎస్ తన వంతు సహకారం అందించారు. హైదరాబాద్ వచ్చిన అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జిబుష్ ను వ్యవసాయ ప్రదర్శనకు తీసుకెళ్లి.. రైతు లేనిదే రాజ్యం లేదని చాటిచెప్పారు. 

 

రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన రెండు నెలలకే తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు వైఎస్సార్. ఆయన మరణవార్త విని ఎంతోమంది ప్రాణాలు ఆగిపోయాయి. రాజన్న ఒక్క మాట కూడా చెప్పకుండా.. మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్లావు అంటూ ఆయన వలన లబ్ది పొందిన ప్రజలు వెక్కివెక్కి ఏడ్చారు. ఎంతోమంది నాయకులు వచ్చి పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో స్థిర నివాసాన్ని నిలుపుకుంటారు. అలాంటి వారిలో వైఎస్సార్ ఒకరని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: