జగన్ విశాఖ.. ఈ రెండింటికీ ఎంతో అవినాభావ సంబంధం ఇటీవల ముడిపడిపోయింది. జగన్ ఎపుడైతే విశాఖను పాలనారాజధాని అన్నారో నాటి నుంచి విశాఖ మీదనే అందరి చూపు పడింది. విశాఖ నుంచి పాలించాలని, అపుడే ఏపీలోని పదమూడు జిల్లాలు అభివ్రుధ్ధి చెందుతాయని జగన్ భావిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా విశాఖే రాజధాని అని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నారు. చాప కింద నీరులా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయింది. ఈ మధ్యనే డీజీపీ గౌతం సవాంగ్ విశాఖ వచ్చి రెండు రోజుల పాటు మకాం వేసి మరీ అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశారు. తాము ఎపుడు అంటే అపుడు విశాఖకు షిఫ్ట్ అవడానికి సిధ్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

 

ఇక జగన్ సైతం ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 17న అధికార వికేంద్రీకరణ బిల్లు మండలికి రెండవ సారి పంపి నెల రోజులు అవుతుంది కాబట్టి దాన్ని గవర్నర్ కి పంపించి చట్టంగా తీసుకురావాలనుకుంటున్నారు. ఇక మంచి రోజు చూసుకుని విశాఖకు వెళ్లాలని జగన్ ఆలోచనగా ఉంది. 

 

సచివాలయం సంగతి పక్కన పెడితే ముందుగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని విశాఖకు షిఫ్ట్ చేస్తారని అంటున్నారు. తాను ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుంది అని, అక్కడ నుంచే పాలన సాగిస్తాను అని  శాసనసభ సాక్షిగా జ‌గన్ అన్న సంగతి  విధితమే. దాన్ని అమలులో పెట్టేందుకు జగన్ ముందుగా విశాఖకు వస్తారని,  పాలనారాజధానిలో భాగమైన సీఎం ఆఫీస్ విశాఖలో తొట్టతొలిగా ఏర్పాటు అవుతుందని అంటున్నారు. మరి చూడాలి జగన్ ఎపుడు విశాఖకు రానున్నారో. ఆ ముహూర్తంగా ఏ తేదీని నిర్ణయించారో అన్నది ఇపుడు అంతా చర్చగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: