ఎల్జీపాలిమర్స్‌ కంపెనీ తన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. పరిశ్రమ నిర్వహణలో విఫలమైన ఎండీ, టెక్నికల్‌ డైరక్టర్‌ సహా 12 మంది కటకటాల వెనక్కి వెళ్లారు. వీరందరికీ రెండు వారాల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక అంశాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. 

 

స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదంలో అరెస్ట్ అయిన ఎల్జీపాలిమర్ ఎండీ సహా 12మందిని సెంట్రల్ జైలుకు తరలించారు.  యాజమాన్య నిర్లక్ష్యం, వైఫల్యాల వల్లే గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వం నియమించిన  హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిపుణులైన సిబ్బంది లేకపోవడం....ప్రమాదకరమైన రసాయినాలతో నడుస్తున్న పరిశ్రమలో కనీస జాగ్రత్తలు తీసుకో కపోవడాన్ని ఎత్తి చూపించింది. ప్రమాదం సంభవించిన మే7వ తేదీన  గోపాలపట్నం పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వీటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాల్ని సేకరించారు.  స్టైరిన్ లీక్ అవ్వడానికి రెండు వారాల ముందుగానే పాలిమరైజేషన్ ప్రారంభమైన పట్టించుకోలేదని నిర్ధారించుకుంది.  తెల్లవారు జామున ప్రమాదం జరినప్పుడు సైరన్లు మోగించకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటి ఆధారంగా ఎండీ సహా 12 మందిని అరెస్ట్‌ చేశారు.

 

రెండు నెలలుగా ఈ కేసును విచారిస్తున్న ద్వారాకా జోన్ పోలీసులు హైపవర్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరిన 48గంటల్లోనే అరెస్టులు పర్వం ప్రారంభించారు. సాంకేతిక,సేఫ్టీ విభాగాల బాధ్యులను ఇందులో చేర్చారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత 12 మందిని కేజీహెచ్‌కు తరలించి కోవిడ్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏసీపీ కార్యాలయం నుంచి నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ మూర్తి ఎదుట హాజరుపరిచారు. జూమ్ ద్వారా వీరిని విచారించిన న్యాయస్థానం 15రోజుల రిమాండ్ విధించింది.

 

సంచలనం సృష్టించిన ఈ గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. విచారణలో బాధ్యులని తేలితే మరికొందరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: