తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నగరంలో అన్ని ఏరియాల నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
నగరంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తోంది. బల్దియా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ నగరంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రశ్న అధికారులను సైతం వేధిస్తోంది. జూన్ నెలలో హైదరాబాద్ నగరంలో 11,000 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఆరు రోజుల్లోనే 7,800 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయబోతూ ఉండటం ప్రజలకు షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నగరంలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 
 
వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు నగరానికి తిరిగి వస్తూ ఉండటంతో వీళ్లే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరిగినా ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు లాక్ డౌన్ విధించబోరని తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని.... అందువల్ల లాక్ డౌన్ విధించబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: