పచ్చని సంసారంలోకి మూడోవ్యక్తి ప్రవేశిస్తే ఆ సంసారం కూలడం ఖాయం అన్న సంగతిని చాలా మంది, ఎన్నో సందర్భాల్లో ఉదాహరిస్తారు.. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ప్రస్తుత పరిస్దితుల్లో భారత్, మధ్యలో చైనా, మరోవైపు నేపాల్.. అంటే ఇక్కడ చైనా నేపాల్‌ను రెచ్చగొట్టి భారత్‌కు లేని సమస్యలను సృష్టిస్తుంది.. ఒకరకంగా తాను చేయాలనుకున్న పనిని నేపాల్‌తో చేపిస్తుంది..

 

 

ఇకపోతే నేపాల్‌కు భారత్‌కు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు.. హిమాల‌యాల‌కు ద‌క్షిణాన ఉండే నేపాల్‌, భార‌త్‌ల సంస్కృతీ సంప్ర‌దాయాలు, భౌగోళిక ప‌రిస్థితులు, దౌత్య సంబంధాలు ప్రపంచంలోనే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి. ఎందుకంటే రెండు దేశాల్లోని భిన్న జాతులు, భిన్న మ‌తాలు, లౌకిక భావ‌న‌లు ఈ బంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేశాయి. ఇంతకాలం ఒక‌రిపై మ‌రొక‌రు ఆధార‌ప‌డుతూ ముందుకుసాగేలా న‌డిపించాయి. అయితే ఈ బంధాల్లో కొన్ని ఒడిదుడుకులూ ఉన్నా, భౌగోళిక‌ రాజ‌కీయ, స‌రిహ‌ద్దు వివాదాలు గ‌తంలోనూ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌ను ప్ర‌భావితం చేసినా, సమస్య అనేది ఇంతలా ముదిరిన దాఖాలు లేవు.. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో చైనా చేస్తున్న కుట్రల వల్ల, చైనా, భార‌త్‌, నేపాల్‌ల కూడ‌లిలోనున్న లిపులేఖ్‌పై వివాదం మ‌ళ్లీ ట్రెండ్ అవుతోంది.

 

 

రెండు దేశాల మధ్య ఉన్న హిమాల‌యాలంత పురాత‌న‌మైన ద్వైపాక్షిక సంబంధాలను మ‌ళ్లీ ఒడిదుడుకుల‌కు గురిచేస్తోంది. ఇది ఒకరకంగా చైనా అవకాశంగా మలచుకుంది. ఈ నేపధ్యంలో నేపాల్ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో చైనా రాయ‌బారి జోక్యం చేసుకుంటున్న‌ట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా ఓలితో భార‌త్ విభేదాలు, భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు వివాదాల న‌డుమ చైనా జోక్యాన్ని భార‌త ప్రభుత్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. కాగా గ‌త శుక్ర‌వారం చైనా రాయ‌బారి.. నేపాల్‌లోని ఐదుగురు అగ్ర నాయ‌కుల‌ను క‌లిసిన‌ట్లు అధికారిక వ‌ర్గాలు తెలిపాయట. ఇకపోతే మాధ‌వ్‌తో స‌మావేశం మిన‌హా.. మ‌రే ఇత‌ర స‌మావేశానికి సంబంధించిన విషయాన్ని నేపాల్ నాయ‌కులు గానీ, చైనా రాయ‌బారి కార్యాల‌యం గానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ చేయ‌లేదు.

 

 

ఇక చైనా రాయ‌బారి సీపీఎన్ నేత‌ల‌తో ఇలా క‌ల‌వ‌డం ఇదేమీ తొలిసారి కాదట. ప్ర‌ధాని ఓలిపై మే నెల‌లోనూ వ్య‌తిరేక‌త పెరిగిన‌ప్పుడు ఇలాంటి స‌మావేశాలు జ‌రిగి, చాలా చ‌ర్చ కూడా న‌డిచిందట. అయితే నేపాల్‌లో ప్రస్తుతం నెలకొంటున్న రాజ‌కీయ సంక్షోభం న‌డుమ సీపీఎన్ నాయ‌కులు, చైనా రాయ‌బారి స‌మావేశం కావ‌డం చాలా ఊహాగానాల‌కు తావిస్తోంది. అయితే దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో విదేశాలు జోక్యం చేసుకోకూడ‌దని త్రిభువ‌న్ యూనివ‌ర్సిటీ అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల విభాగం అధిప‌తి కేసీ ఖ‌డ్గా వ్యాఖ్యానించారు..

 

 

ఇదిలా ఉండగా గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా చైనా, నేపాల్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా వ్యూహాత్మ‌క బంధాల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్రమంలో నేపాల్‌తో బంధాల‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డం ద్వారా ఆసియాలో త‌న ప్రాబ‌ల్యాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని భావిస్తుందట.. ఇలా చాపకింద నీరులా నేపాల్‌తో వ్యవహరిస్తున్న చైనా ప్ర‌స్తుతం నేపాల్‌లో ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో అనే అనుమానాలు తలెత్తుతున్నాయట. అయితే నేపాలీలు మాత్రం రెండు దేశాల జోక్యం అవ‌స‌రంలేద‌ని భావిస్తున్నారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి.. ఇక ఈ పరిస్థితిని గమనిస్తే చైనాతో నేపాల్ పడిన, పడుతున్న లాభం ఎంతో తెలియదు గానీ, భారత్‌తో  విభేదిస్తే మాత్రం నేపాల్ నష్టపోవలసి వస్తుందంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: