కరోనా పేరు చెబితేనే ఇప్పుడు జనం వణికిపోతున్నారు. ఓవైపు ఆ రోగం వస్తే ఎక్కడ ప్రాణం పోతుందో అన్న భయం నిన్నటి వరకూ ఉంటే.. ఇప్పుడు ఆసుపత్రుల ఫీజులు చూసి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఇదే ఛాన్సని కరోనా వచ్చిన రోగుల ఆర్థిక స్థోమతును బట్టి ఫీజులు పిండేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో కరోనా వచ్చినా పెద్దగా భయపడాల్సిన పని లేదు.  

 


ఎందుకంటే.. ఇప్పుడు ఏపీ సర్కారు.. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేసింది. అంటే.. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్లు ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని వెళ్లి ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చన్నమాట.  ఆ ఆసుపత్రి బిల్లు ఆరోగ్య శ్రీ ట్రస్టు కట్టుకుంటుందన్నమాట. ఇందుకు అవకాశం కల్పిస్తూ.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులలో కరోనా చికిత్సలకు వసూలు చేయవలసిన చార్జీలను ఏపీ సర్కారు ప్రభుత్వం నిర్ణయించింది. 

 


ఇక ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రిలో చేరితే.. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా ప్రభుత్వం నిర్ధారించింది.  క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. అదే ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్‌ చేయనున్నారు.

 


ఇంకా వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది. ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఇక ఏపీలో పేదలకు కరోనా వచ్చినా వైద్యానికి ఢోకా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: