ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భార‌త‌దేశంలోనూ త‌న ఉధృతిని కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి బారిన ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు ప‌డుతున్నారు. అయితే, దీనిపై తాజాగా షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. చిన్నారులు, పెద్ద వయసు వారిలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటున్నప్పటికీ,  ఇటీవల 20 నుంచి 50 ఏళ్ల వారిలో కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. యుక్త, మధ్య వయస్కుల్లో కొందరిలో మాత్రమే స్పష్టంగా లక్షణాలు కనిపిస్తుండగా, ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. తీరా పరీక్షలు చేయిస్తే వైరస్‌ నిర్ధారణ అవుతోంది. 

 


యువత నిర్లక్ష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా యువతలో పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లో నమోదైన కేసులు, మరణాల్లో యువత, మధ్య వయస్కులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మన దేశంలో నమోదైన కేసులు పరిశీలించినా 15 నుంచి 59 ఏండ్లవారు వైరస్‌ బారినపడటం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇక మరణాల్లో 48శాతం వరకు ఈ వయసువారు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మరణించిన ప్రతి ముగ్గురిలో ఒకరు 45-59 వ‌య‌సుల వారే. ఇలాంటి వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా.. వీరిలో కరోనా ఉంటున్నది.. ఆరోగ్యం బాగానే ఉందని బయట తిరుగుతుండటంతో ఇతరులకు సోకుతోంది! సందేహం వచ్చి పరీక్షలకు వెళితే సదరు యువకుల్లో వైరస్‌ బయటపడుతోంది! అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే.. ప్రాణాలనూ హరిస్తోంది.

 


వయసుతో నిమిత్తం లేకుండా కరోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో అస‌లు యువ‌త ఎందుకు రోడ్ల మీద‌కు వ‌స్తున్నార‌నే సందేహం తెర‌మీద‌కు వ‌స్తోంది. నిత్యావసరాలు, ఉపాధి, ఉద్యోగం తదితర కారణాలతో యువత బయట తిరుగుతున్నారు. ఈ సమయంలో చాలామంది మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్లు వినియోగాన్ని పకడ్బందీగా పాటించటం లేదు. దీంతో వైరస్‌ యువతను ఆధారంగా చేసుకొని వ్యాప్తిస్తున్నది. కరోనా వైరస్‌ సోకినప్పటికీ యువతలో లక్షణాలు కనిపించకపోవడం పెద్ద సమస్యగా మారుతున్నది. వైరస్‌ను గుర్తించేలోగా ఇంట్లో ఉన్న చిన్నారులు, పెద్దలకు వ్యాప్తి జరుగుతున్నదని పేర్కొంటున్నారు. వారికి తెలియకుండానే వైరస్‌కు వాహకంగా మారుతున్నారని, అందుకే యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: