జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇక పలు నిర్ణయాలకు కోర్టు ద్వారా బ్రేక్ పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జూలై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా బ్రేక్ పడింది. ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడిందని చెప్పి టీడీపీ నేతలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. పైగా ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూములు కొన్ని వివాదాల్లో ఉన్నాయి.

 

దీంతో జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగష్టు 15కు వాయిదా వేశారు. అయితే తమ హయాంలో కట్టిన ఇళ్లని వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగారు. తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు నిరసనదీక్షలకు దిగడమేంటని ఎద్దేవా చేశారు. దొంగే దొంగా అని అరచినట్లవుతుందని అన్నారు. తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు.

 

ఇక విజయసాయి చేసిన వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ళు కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.  ఇళ్ల పట్టాల్లో లెక్కలేనంత అక్రమాలు చేసి, ఇప్పుడు టీడీపీ అడ్డుకుందని విజయసాయి బీదఅరుపులు అరవడం ఏంటో అర్ధం కావడం లేదని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు అడ్డుకుంటే ఏదైనా ఆగిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్‌ని అడ్డుకునే సత్తా చంద్రబాబుకు ఉందని విజయసాయి ఒప్పుకుంటారని అడుగుతున్నారు.

 

ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని టీడీపీకి అడ్డుకోవాల్సిన అవసరం లేదని, కానీ అందులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే ప్రజలకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లారని చెబుతున్నారు. అసలు ఇళ్ల పట్టాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సొంత పార్టీ కార్యకర్తలతో అనిపిస్తే చాలా గ్రేట్ అని, ఇంకా ప్రజల్లోకి వెళ్ళితే ఎలాంటి అక్రమాలు జరిగాయో చక్కగా చెబుతారని తమ్ముళ్ళు విజయసాయికి స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: