59 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ ఇటీవలే భారత్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగా... ఇప్పుడు ఆ జాబితాలో అమెరికా కూడా చేరబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. స్వయంగా అధ్యక్షుడు ట్రంపే ఈ వ్యాఖ్యలు చేశారు.

 

గల్వాన్‌ లోయలో వివాదం తర్వాత 59 చైనా యాప్‌లను నిషేధించింది... భారత ప్రభుత్వం. దీనికి ప్రజల నుంచి కూడా గట్టి మద్దతు లభించింది. టిక్‌టాక్‌ సహా చాలా మంది వాడే చైనా యాప్‌లు ఇప్పుడు భారతీయుల మొబైళ్లలో కనిపించడం లేదు. ఇప్పుడు అమెరికా కూడా టిక్‌టాక్‌ను నిషేధించే ఆలోచన చేస్తోంది. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయానికి కారణమైందంటూ... చైనాపై అమెరికా చాలా రోజుల నుంచి కోపంగా ఉంది. వైరస్‌ విషయంలో వాస్తవాలు దాచి లక్షల మంది ప్రాణాలు తీసిందంటూ చాలాసార్లు ట్రంప్‌ చైనాపై విరుచుకుపడ్డారు కూడా. డ్రాగన్‌ కంట్రీపై చర్యలు తప్పవని చెబుతూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు... తాజాగా టిక్‌టాక్‌ నిషేధంపై కూడా మాట్లాడారు. అదొక పెద్ద వ్యాపారమన్న ట్రంప్‌... అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించే అంశాన్ని ప‌రిపాల‌నా విభాగం ప‌రిశీలిస్తోందన్నారు. చైనాపై ప్రతీకారం తీర్చుకునే చాలా మార్గాల్లో ఇదొక‌టి అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

 

ఇక అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ కూడా... చైనా కంపెనీలైన హువావే, టిక్‌టాక్‌పై తమ నిర్ణయంలో ఎటువంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. హువావే, టిక్‌టాక్ వంటి చైనీస్ సంస్థలు అమెరికా భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున, అలాంటి వాటిపై తమ ప్రభుత్వం చాలా కఠిన వైఖరి అవలంభిస్తుందని ఆయన చెప్పారు.

 

చైనాకు సంబంధించిన యాప్ లపై ఒక్కో దేశం సమర శంఖం పూరిస్తోంది. డ్రాగన్ కంట్రీ యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. మనదేశంపై ఆ దేశ సైనికులు ఎపుడు దాడికి దిగారో అప్పటి నుంచే కొన్ని దేశాలు చైనాకు సంబంధించిన వాటిని బహిష్కరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే భారత్ ను అమెరికా దేశం అనుసరిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: