మనలో చాలామంది సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం చేసే పని చిన్నదో పెద్దదో ఆలోచించకుండా... అంకితభావంతో పని చేస్తూ.... చేసే పనిని గౌరవిస్తూ నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లే జీవితంలో రియల్ హీరోలవుతారు. తాజాగా తమిళనాడు రియల్ హీరో శివన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శివన్ కథ తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
శివన్ క్రూర మృగాలకు సైతం వెరవకుండా దట్టమైన అడవుల్లో 30 సంవత్సరాల పాటు రోజూ 15 కిలోమీటర్లు నడిచి విధులు నిర్వహించిన ఒక పోస్ట్ మాన్. గత వారం ఆయన పదవీ విరమణ పొందారు. బాహ్య ప్రపంచం తొంగిచూడలేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ఉత్తరాలు అందించి విధులు నిర్వహించిన శివన్ గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అడవి, జలపాతాల గుండా 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లిన శివన్ క్రూర మృగాల దాడులను కూడా ఎదుర్కొన్నారు. 
 
మరో వ్యక్తి అయితే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడమో, ఉద్యోగానికి రాజీనామా చేయడమో చేసేవాడు. కానీ శివన్ బెదరకుండా 30 ఏళ్లుగా అడవిమార్గం గుండా వెళ్లి విధులు నిర్వహించారు. 2016లో వచ్చిన ఓ కథనం ప్రకారం అప్పటికి ఆయన జీతం 12వేల రూపాయలు. నిజానికి ఆయన పడుతున్న కష్టానికి 12వేలు పెద్ద మొత్తం కాకపోయినా పనిపై ఉన్న ప్రేమతో శివన్ విధులు నిర్వహించారు. 
 
కూనూర్ సమీపంలోని హిల్‌ గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ గా శివన్ ఇంతకాలం పని చేశారు. ఆయన సేవల గురించి తెలిసి ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు 69 వేల లైకులు రాగా 14,000 మంది రీట్వీట్ చేశారు. ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ "దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది.. ఆయన అంకితాభావానికి తలవంచి నమస్కరిస్తున్నా" అని పేర్కొన్నారు. సామాన్యుల నుంచి ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్న అధికారులు సైతం శివన్ ను కొనియాడుతున్నారు. కూనూర్ పోస్టు ఆఫీసుకు శివన్ పేరు పెట్టాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: