వైఎస్ తో దాదాపు 4 దశాబ్దాల పాటు కలిసి నడిచిన జీవిత భాగస్వామిగా.. విజయమ్మ ఆయనపై పుస్తకం రచించారు. అందరికీ తెలిసిన రాజకీయ నాయకుడిని కాకుండా.. వ్యక్తిగతంగా వైఎస్ మనుషులకిచ్చే విలువేంటి.. కుటుంబంతో ఆయనకున్న అనుబంధం ఏంటనే ఆసక్తికరమైన విషయాల్ని విజయమ్మ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్ భావోద్వేగానికి లోనవ్వగా.. పుస్తకం చదివితే అమ్మ నాన్నతో చేసిన ప్రయాణం ఏంటో తెలుస్తుందని షర్మిల చెప్పారు. 

 

ఒక రాజకీయ నేతగా ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఆయనేంటనేది ఆమెకు మాత్రమే తెలుసు. 37 ఏళ్ల జీవన సాహచర్యంలో వైఎస్ తో తన అనుభవాల్ని రంగరించి.. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం తీసుకొచ్చారు విజయమ్మ. వైఎస్ ను ఓ భార్యగా విజయమ్మ చూసిన కోణమే ఈ పుస్తకం. వైఎస్ తో, వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్నవారందరికీ.. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం ఇస్తానంటున్నారు విజయమ్మ. ఈ పుస్తకాన్ని సహృదయంతో అందరూ చదవాలని కోరారు. వైఎస్సార్ తనకు స్ఫూర్తి అని చెప్పిన విజయమ్మ.. ఆయన మాటలు అందరిలో స్ఫూర్తి నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి తన వాడే కాదని.. అందరి వాడని అభిప్రాయపడ్డారు. ఈ అనుబంధం కలకాలం ఉండాలని, అందరి ప్రేమ, ఆశీర్వాదాలు తన బిడ్డలకు ఉండాలని కోరుకున్నారు విజయమ్మ. 

 

వైఎస్సార్‌ ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకుని ఆచరణలో పెట్టాలన్నారు విజయమ్మ. తనతోనే కాకుండా, రాష్ట్ర ప్రజలందరితోనూ ఆయనకు చెరగని బంధం ఉందని గుర్తుచేశారు. వైఎస్ సాహచర్యం ఒక మార్గదర్శకమన్న విజయమ్మ.. ఆయన పిలుపు ఓ భరోసా అని, ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. వైఎస్సార్‌ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయని తెలిపారు విజయమ్మ. 

 

37 ఏళ్ల వైఎస్ సాహచర్యంలో తాను ఆయనలో చూసింది, మాటల్లో విన్నది రాయాలనిపించే పుస్తకం తీసుకొచ్చానని చెప్పారు విజయమ్మ. వైఎస్ మాటకిచ్చే విలువ గురించి రాయాలనిపించిందన్నారు. ఎంతో మంది జీవితాలకు వైఎస్ వెలుగునిచ్చారని విజయమ్మ గుర్తుచేశారు. మనుషుల జీవితాలకు వైఎస్ ఎలాంటి విలువ ఇచ్చారో తాను కళ్లారా చూశానని, తాను విన్నానని విజయమ్మ చెప్పారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జీవితం గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారన్నారు. వైఎస్ చిరునవ్వు స్వచ్ఛతకు మారుపేరన్నారు విజయమ్మ. వైఎస్సార్ ధైర్యం సాటిలేనిదన్న విజయమ్మ.. ఆయన యుగయుగాల పాటు నిలిచి ఉంటారరని చెప్పారు. వైఎస్ నుంచి తాను, తన పిల్లలు చాలా నేర్చుకున్నామన్నారు. ఈరోజుకీ తన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవాడు, మా మామయ్య ఎలా ఆలోచించేవారు అని గుర్తుచేసుకుంటారన్నారు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా.. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం చదవాలని కోరారు విజయమ్మ. ఈ పుస్తకంలో అందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, వైఎస్ జీవితం అలాంటిదని చెప్పుకొచ్చారు. 

 

నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. నాన్నలో ఉన్న తండ్రి, భర్త, మంచి వ్యక్తి గురించి అమ్మ రాసిందని చెప్పారు. బయటి ప్రపంచానికి వైఎస్ గొప్ప రాజకీయ నేతగా తెలుసన్నారు జగన్. నాన్నతో చేసిన సుదీర్ఘ ప్రయాణంలో అమ్మ తెలుసుకున్న, చూసిన దాని గురించి పుస్తకంలో రాశారని జగన్ వివరిరంచారు. 

 

తనకు మాత్రమే సొంతమైన కోణం నుంచి నాన్నను లోకానికి అమ్మ కొత్తగా పరిచయం చేసిందని షర్మిల చెప్పారు. పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మతో, నాన్నతో కలసి ప్రయాణిస్తున్నట్లే అనిపించిందన్నారు. నిజం చెప్పడం సులభం కాదని, అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పిందని కితాబిచ్చారు షర్మిల. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం అందరూ చదవాలని కోరారు షర్మిల. 

 

వైఎస్ ను అభిమానించే వారికి.. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని విజయమ్మ చెప్పారు. ఆయన గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఎన్నో అనుభవాలు మిగుల్చుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: