తెలంగాణ‌లో క‌రోనా క‌ల‌క‌లం, అందిస్తున్న చికిత్స‌పై వివిధ వ‌ర్గాలు భిన్నంగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ విష‌యంలో రాష్ట్ర హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ‌లో ఆస్ప‌త్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో, ఎంత మందికి ట్రీట్ మెంట్ చేస్తున్నారో, ఎన్ని బెడ్స్‌/వెంటిలేటర్స్‌ ఖాళీగా ఉన్నాయో.. అందరికీ తెలిసేలా లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించే ఆస్పత్రుల వద్ద లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ అడ్వకేట్ శివ గణేష్‌ కర్నాటి దాఖలు చేసి వ్యాజ్యాన్ని విచారించిన సంద‌ర్భంగా ఈ మేర‌కు కోర్టు వెల్ల‌డించింది.

 

క‌రోనా చికిత్స విష‌యంలో కీల‌క‌మైన స‌మాచారాన్ని పేర్కొంటూ డ్యాష్ బోర్డుల‌ను ఇప్పటికే ఢిల్లీలో ఏర్పాటు చేశారని హైకోర్టు బెంచ్ తెలిపింది. ఢిల్లీ వంటి సాఫ్ట్‌వేర్, టెక్నికల్‌ సమాచారాన్ని తెలుసుకుని రాష్ట్రంలోనూ అమలు చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని బెంచ్ తెలిపింది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని తెలపాలంది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్‌ వేర్‌ తయారు చేస్తోందని కోర్టుకు ఏజీ తెలిపారు. కాగా, ఈ రూపంలో స‌మాచారం అందిస్తే ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌లు, ప్ర‌జ‌లు ఎదుర్కునే స‌మ‌స్య‌ల‌కు సైతం ప‌రిష్కారం అందించిన‌ట్లు అవుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

 

కాగా, రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నోరుపారేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇంకా ఎక్కువకాలం లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని.. ప్రతి ఒక్కరికీ జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమేనన్నారు. ఆస్ప‌త్రుల్లో సేవ‌లు మెరుగుప‌రుస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఇలా మాట‌ల దాడి కంటే, వివ‌రాల‌తో కూడిన స‌మాచారం ఇస్తే ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: