ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,555 కొత్త కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు. కరోనా పరీక్షల విషయంలో దేశంలోనే ఏపీకి మంచిపేరు వచ్చింది. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో నిన్న పరీక్షలు నిర్వహించే సిబ్బంది వైరస్ భారీన పడ్డారు. పలు ఆస్పత్రుల్లో వైద్యులు సైతం కరోనా భారీన పడ్డారు. దీంతో వైద్యులు జగన్ కు ఆగ్రహావేశాలతో లేఖ రాశారు. లేఖలో జగన్ సర్కార్ వైద్యుల స్థాయికి తగిన గౌరవం ఇవ్వలేని పక్షంలో కరోనా విధుల నుంచి తప్పుకునేందుకు అనుమతివ్వాలని పేర్కొన్నారు. కొత్తగా నియమిస్తున్న వైద్యులు ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని సూచించారు. 
 
లేఖలో ఉన్నతాధికారులు వైద్యాధికారులను అవమానాలకు గురి చేస్తున్నారని.... రాష్ట్రంలో వైద్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.... ఎంపీడీవోలు, తహశీల్దార్ లు నిర్వహించే కార్యక్రమాలకు తమను హాజరు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయని... ఈ సమావేశాలకు వారం వారం హాజరు కావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. 
 
విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్వహణ వైద్యాధికారుల బాధ్యత కాదని... తమ పరిస్థితులు దుర్లభంగా మారాయని... పలు ప్రాంతాల్లో వైద్యులు మరణించినా నష్టపరిహారం ప్రకటించలేదని పేర్కొన్నారు. వైద్య సంఘంలోని వైద్యులు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. అయితే మరోవైపు కరోనా కష్ట కాలంలో వైద్యులు ఇలాంటి లేఖలు రాయడం సరికాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైద్యుల రాసిన లేఖ గురించి జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: