ఎవరు ఏం చెప్పినా తాను ఎందుకు వినాలి ? తాను చెప్పిందే అందరూ వినాలనే అభిప్రాయంతో ఉండే వ్యక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు. ఏ వ్యవహారమైనా ఎంతవరకు లాగాలో అంత వరకు మాత్రమే లాగుతారు. తాను ఏం చేసినా తెలంగాణ ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకునే చేస్తానని జనాలను నమ్మిస్తారు. ఇటువంటి వ్యూహాలు, ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ బాగా ఆరితేరిపోయారు. తనకు తెలంగాణలో ఎదురేలేదు అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా వచ్చిపడింది. మొదట్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా, కేసీఆర్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల కంటే మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చేవారు. నిత్యం ప్రజలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు చెబుతూ, అప్రమత్తంగా ఉండాలంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేవారు. 

 

IHG

ఒక దశలో కేంద్రం ఏమీ చేయలేకపోతుంది.. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలనే అభిప్రాయాన్ని జనాల్లో కల్పించారు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం అవుతున్న తీరు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని హైలెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. జనాలంతా ఈ కరోనా భయంలో ఉండగానే, 132 ఏళ్ల చరిత్ర కలిగిన పాత సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ప్రతిపక్షాలు ఎంత అడ్డుకున్నాకూల్చివేతలు కొనసాగిస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

IHG


కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో, ఆ వ్యవహారాన్ని పట్టించుకోకుండా, కూల్చివేతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా, కేసీఆర్ మాత్రం అవి ఏవీ పట్టించుకోకుండా 500 కోట్లు పెట్టి మరీ నూతన సచివాలయ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు బ్లూ ప్రింట్ కూడా రెడీ అయ్యింది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ విమర్శలను పక్కదారి పట్టించేందుకే కెసిఆర్ ఈ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చి జనాలను, ప్రతిపక్షాలను డైవర్ట్ చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

 

కేసీఆర్ మూఢ నమ్మకాలతో, స్వామిజీలు చెప్పినట్టుగా వింటూ, ప్రజలను పట్టించుకోవడం మానేశారు అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేస్తున్నారని, ప్రజలను గాలికొదిలేశారని ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నా, కేసీఆర్ మాత్రం జనాల్లోకి రావడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: