తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రి కరోనా రోగి కుటుంబ సభ్యులతో ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి చనిపోయాడని చెప్పి కార్పొరేట్ ఆస్పత్రి కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేసింది. చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్న భార్యా పిల్లలకు కరోనా రోగి బ్రతికే ఉన్నాడని తెలియడంతో నిలదీయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
బీజేపీ సీనియర్‌నేత సి.నర్సింగరావు(67) గత నెల 27న శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐసీయూలో నాలుగు రోజులు ఉంచిన ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే జులై 8వ తేదీ రాత్రి నర్సింగరావు కన్నుమూశారని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 
 
రోగి కుటుంబ సభ్యులు కరోనా రోగి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చా....? అని ప్రశ్నించగా జీహెచ్‌ఎంసీకి మృతదేహాన్ని అప్పగిస్తామని తెలిపారు. అనంతరం రోగి కుటుంబ సభ్యుల నుంచి బిల్లులు వసూలు చేసుకుని, సంతకాలు తీసుకున్నారు. అనంతరం వాళ్లకు రోగి చనిపోలేదని ఆస్పత్రి సిబ్బంది అబద్ధం చెప్పారని తెలిసింది. ఐసీయూలో ఉన్న నరిసింగరావును వీడియో కాల్ లో సంప్రదించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా రోగి కోడలు సోనియా రూ.4 వేల ఇంజక్షన్ కు రూ.40 వేలు వసూలు చేశారని చికిత్స కోసం 8 లక్షల రూపాయల బిల్లు వేశారని ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. గొప్ప ఆస్పత్రి అని తాము భావించామని కానీ ఇంత చెత్త ఆస్పత్రి అని అనుకోలేదని ఆమె చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: