టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. చంద్రబాబు జనం సొమ్మును దుబారా చేశారన్న పేరు తెచ్చుకున్నారు.. ఏ మీటింగ్ జరిగినా అప్పట్లో ఏదో ఒక కన్వెన్షన్ సెంటర్లోనే జరిగేది.. సర్కారు భవనాలు అందుబాటులో ఉన్నా.. ప్రైవేటు హోటళ్లలో సమావేశాలు జరిగేవి.. అంతే కాదు.. వాటి ఖర్చు కూడా ఓ రేంజ్ లో ఉండేది.

 


చంద్రబాబు తాగే హిమాలయన్ వాటర్ బాటిల్ కూడా వందల్లో ధర ఉండేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉండేది.  చంద్రబాబు పై ప్రజలకు విరక్తి కలిగేందుకు ఈ ప్రచారం కూడా ఓ కారణం అయ్యింది. అయితే సీఎంగా జగన్ వచ్చాక కూడా అలాగే జరుగుతోందని ఇప్పుడు  టీడీపీ ఆరోపిస్తోంది. 

 


ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం జరిగిన రోజున వాటర్ బాటిళ్లు, అల్పాహారానికి అయిన ఖర్చు 59.49 లక్షలా అంటూ లోకేశ్ తాజాగా ఓ విమర్శ చేశారు. డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేశారంటే ఇదే..! రాజుల సొమ్ము రాళ్లపాలు.. ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్ల పాలు.. అంటూ సెటైర్లు పేల్చారు.. ముఖ్యమంత్రి ఒక సమావేశంలో తాగిన వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖరీదు అక్షరాలా రూ.43.44 లక్షలు. ఒక్క రోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయ్యుండాలి. లేదంటే కుంభకోణమైనా చేసుండాలి .. అంటూ విమర్శించారు. 

 


ఇప్పుడు ఇతర టీడీపీ నాయకులు కూడా ఇదే రాగం ఆలపిస్తున్నారు. ఇక బుద్దా వెంకన్న అయితే.. జగన్ ప్రమాణ స్వీకారం ఖర్చును ఇంకా చెల్లిస్తూనే ఉన్నారంటూ కొన్ని బిల్లులు చూపించారు. జగన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున వాటర్‌ బాటిళ్లు, అల్పాహారానికి రూ.59.49 లక్షలు బిల్లు అయిందట. తిన్నవి స్నాక్సా? కరెన్సీ నోట్లా?’.. అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శల్లో వాస్తవం ఎంత.. అనేది తేలాల్సి ఉంది. దుబారా ఎవరు చేసినా దాన్ని ప్రజలు హర్షించరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: