నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందాడు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్ వికాస్ దూబే హతమయ్యాడు. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉజ్జయిని నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు తరలిస్తుండగా కారు శుక్రవారం ఉదయం బోల్తా కొట్టింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడని, దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో వికాస్ దూబే మృతిచెందినట్లు సమాచారం. అతడి మృతదేహాన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

 

అయితే ఈ క‌రుడు గ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ గురించి ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తున్నాయి. అత‌డి దారుణాలు, దాష్టీకాలు, దౌర్జ‌న్యాలు అన్నీ ఇన్నీ కావ‌ని తెలుస్తోంది. జైలు జీవితం అనుభ‌వించినా దూబేలో ఎలాంటి మార్పు క‌న‌బ‌డ‌క‌పోవ‌డ‌మే కాక అక్క‌డి నుంచే రెండు హ‌త్య‌లు చేయించాడు. అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యాదారాల‌ను చూపేందుకు పోలీసులు సైతం ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దూబే చిన్న‌త‌నం నుంచే నేరాల‌కు పాల్ప‌డేవాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ రూరల్‌ జిల్లా బిక్రూ నివాసి అయిన వికాస్‌ దూబే యుక్త వయస్సు నుంచే తనకంటూ ప్రత్యేక అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నాడు.

 

తన గ్యాంగ్‌తో కలిసి భూ ఆక్రమణలు, కిడ్నాప్‌లు, హత్యలు వంటి అనేక నేర కార్యకలాపాలకు పాల్పడేవాడు. 2001లో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంతోష్‌ శుక్లా(బీజేపీ) అనే మంత్రిని నడిరోడ్డుపై ఆపి గొడవపెట్టుకున్న వికాస్‌.. ఆయనను తీవ్రంగా కొట్టడమేకాక, ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడే కాల్చి చంపేశాడు. ఆ తర్వాత రాజ‌కీయ నాయ‌కుల అండ ఏర్ప‌డ‌టంతో మరింతగా రెచ్చిపోయాడు. త‌న మాఫియా సామ్రాజ్యాన్ని విస్త‌రింప‌జేశాడు.  అనతికాలంలోనే కాన్పూర్‌లోని మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌లో ఒకడిగా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: