ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పల్లెల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు సాధారణ ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతున్నాయి. రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వైద్య, ఆరోగ్య శాఖ 1,555 కేసులు నమోదైనట్లు తెలిపింది. వేగంగా విజృంభిస్తోన్న ఈ వైరస్ ప్రభావం రాష్ట్రంలోని విద్యా రంగంపై పడింది. 
 
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ తాజాగా మెయిన్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరూ కంపార్ట్‌మెంటల్‌లో పాస్ అయినట్లు పేర్కొంటామని కీలక ప్రకటన చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ పాస్ మార్కులు వేస్తామని చెప్పారు. 
 
అదే సమయంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం కోల్పోయిన విద్యార్థులకు శుభవార్త చెప్పారు. 2021 మార్చిలో ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పిస్తామని.... విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2021 మార్చి-ఏప్రిల్‌లో సెకండియర్‌ విద్యార్థులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ నిర్ణయం వల్ల లక్షల సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిన్న ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నామని.... 1,47,000 మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుందని ప్రకటించారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: