ప్రపంచ మహమ్మారిపై ఆరునెలలుగా ఎడతెరపి లేకుండా పోరాటం కొనసాగుతోంది. ఇందుకోసం లాక్​డౌన్​ను ఆయుధంగా ఎంచుకొంది భారత్​. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. ఈ పరిణామాలతోనే దేశంలో వైరస్​ కేసులు, మరణాలు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణవాయువునందించే వెంటిలేటర్ల సమస్య ఎదురవుతోంది.

 

కరోనా వైరస్‌పై గత ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా అవిరళ పోరు కొనసాగుతోంది. భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిని అంతమొందించడానికి లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంవంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన కలిగించింది. లాక్‌డౌన్‌ దేశార్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని గుర్తించిన ప్రభుత్వం దాన్ని సడలించి, కొవిడ్‌ నియమావళితో ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

 

 

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో కరోనా అనుకూలత ఉన్న పేషెంట్లకు ఇంటివద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆక్సిజన్‌ స్థాయిలను గుర్తించడం వైద్య సిబ్బందికి కష్టంగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తుల ఆక్సిజన్‌ స్థాయులను పరీక్షించి, తగ్గినప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును తగ్గిస్తోంది. వ్యక్తి రోగనిరోధక శక్తికి శరీరంలో ఆక్సిజన్‌ నిల్వలు తప్పనిసరి. ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందించడం జరుగుతుంది. దీన్నిబట్టి స్పష్టమవుతున్నది ఏమిటంటే- మన శరీరంలో కరోనాను జయించడానికి రోగనిరోధక శక్తి పెంచే ఆహారంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుంది.

 

 

గతంలో ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో చెట్లు ఉండేవి. కానీ, ప్రస్తుతం ఇంటి ముందు ఉపరితలాలను ఫ్లోరింగ్‌, టైల్స్‌తో కప్పడంతో చెట్లు లేక స్వచ్ఛమైన గాలి కరవైపోయింది. దానికితోడు మానవ చర్యల ఫలితంగా గాలి కలుషితమవుతోంది. గాలిలో ప్రాణవాయువు తగ్గుతోంది. గాలి, వెలుతురు ఉన్న ఉపరితల, బహిరంగ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువ ఉంటుందని అమెరికా ప్రభుత్వ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఇటీవల అధికారికంగా వెల్లడించింది. మూసివేసినట్లు ఉండే కార్యాలయాలు, సినిమా హాళ్లు, మతపరమైన ప్రదేశాలు ప్రమాదకరమని గుర్తించింది.
    

మరింత సమాచారం తెలుసుకోండి: