ప్రపంచ వన్యప్రాణి నిధి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ ప్రకృతి ని నాశనం చేయకూడదని, వన్యప్రాణులను సంరక్షించాలని పిలుపునిచ్చింది. 2019 డిసెంబర్ నెల నుండి 2020 మే నెల వరకు 200 దేశాలలోని 3 లక్షల 70 వేల మంది కొవిడ్ -19 కారణంగా చనిపోయారని, ఈ కొవిడ్ -19 మరణాల సంఖ్య ఒక్క సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రవాదుల దాడుల మరణాల సంఖ్య కంటే మూడు రెట్లు అధికమని ప్రపంచ వన్యప్రాణి సంస్థ తెలిపింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా 2.4 లక్షల కోట్ల డాలర్ల నుండి 8.8 లక్షల కోట్ల డాలర్ల వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందట. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలను కోల్పోగా... దాని కారణంగా ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో నివసించేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఒకవైపు డబ్బులు సంపాదించలేక మరోవైపు రెంట్ కట్టలేక ఇక్కట్లు పడుతున్నవారు ఎందరో ఉన్నారు.


ఇలాంటి విపత్కర పరిస్థితిలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ప్రభుత్వాలు నడుం బిగించి ప్రజల్లో వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ సంరక్షణ ఎంత ముఖ్యమో అవగాహన కల్పించాలని ప్రముఖ సైంటిస్టులు చెబుతున్నారు. అక్రమంగా వన్యప్రాణులను చంపేసి రవాణా చేసేవారిని కఠినంగా శిక్షించాలని, చెట్లను నరికి వేస్తూ అడవులను నాశనం చేస్తున్న వారిని కూడా శిక్షించాలని వరల్డ్ వైల్డ్ లైఫ్ సంస్థ కోరింది. జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం, శాస్త్రీయ పరిశోధనలలో పెట్టుబడులు పెట్టడం, రాబోయే రోజుల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై ప్రభుత్వ వ్యూహాలను తాము రూపొందించిన నివేదిక అందిస్తుందని ఐక్యరాజ్యసమితి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ తెలిపారు.



ఆర్థికంగా బలంగా లేని దేశాలు పశువులను చంపేస్తూ వన్య ప్రాణులను కూడా హింసిస్తూ వాటి మాంసాన్ని విపరీతంగా ఉత్పత్తి చేస్తూ జూనోటిక్ వ్యాధులైన ఆంత్రాక్స్, బోవిన్ క్షయ, రాబిస్ వంటి రోగాల బారిన పడి 20 లక్షల మంది పైచిలుకు మరణిస్తున్నారు అని సైంటిస్టులు చెబుతున్నారు. మాంసం ఉత్పత్తి గత 50 సంవత్సరాల్లో 260 శాతం పెరిగిందని అందుకే జంతువుల నుండి అంటువ్యాధులు విపరీతంగా మానవులకు ప్రబలుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండర్సన్ తెలిపాడు. కరోనా మహమ్మారి విజృంభించక ముందు రెండు దశాబ్దాలలో జూనోటిక్ వ్యాధుల వలన 100 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు తెలిపారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: