ప్రపంచానికి కరోనాను అంటించినందుకు చైనాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమెరికా ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. తమ దేశంలో చదువుతున్న లక్షలాది చైనా విద్యార్దులను అమెరికా టార్గెట్‌గా చేసుకుంది. చైనా విద్యార్దులను అమెరికా నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా రిపబ్లికన్లు ఓ బిల్లును కూడా రూపొందిస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసుల్లోకి మారిన విదేశీ విద్యార్ధులు తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ట్రంప్ జారీ చేసిన  ఉత్తర్వుల వెనుక అసలు కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికా మాత్రమే. కరోనా వైరస్ చైనాలో పుట్టినా... నష్టం మాత్రం అమెరికాకే ఎక్కువగా జరిగింది. వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించారని ఆరోపిస్తున్న ట్రంప్... చైనాపై కఠిన చర్యలు తీసుకుంటామని మూడు నెలల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 11 లక్షల మంది విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుతున్నారు. అంతర్జాతీయ విద్యార్ధుల్లో సుమారు 5 లక్షల మంది చైనా స్టూడెంట్సే ఉన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడంతో చైనా విద్యార్ధులను అమెరికా టార్గెట్‌గా పెట్టుకుంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉత్తర్వులు అమల్లోకి వస్తే... ఎక్కువగా నష్టపోయేదే చైనా విద్యార్ధులు... భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలే ఉండటంతో భారతీయ విద్యార్ధుల విషయంలో అమెరికా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోంది. కానీ చైనా విద్యార్దులను మాత్రం మెడపెట్టి గెంటేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్ క్లాసులను సాకుగా చూపి... ఐదు లక్షల మంది చైనా విద్యార్ధులను వదిలించుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా.. రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణానికి చైనా స్టూడెంట్స్ బలైపోతున్నారు.

 

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్శిటీలు కూడా తప్పుపడుతున్నాయి. విదేశీ విద్యార్ధులు చెల్లించే ఫీజుల రూపంలో అమెరికాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే కరోనాను అడ్డంపెట్టుకుని ట్రంప్... అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాయని యూనివర్శిటీలు ఆరోపిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. మరోవైపు అధికార పార్టీకి చెందిన కొంతమంది రిపబ్లికన్లు చైనా స్టూడెంట్స్‌ను అడ్డుకునే దిశగా ఓ బిల్లును కూడా రూపొందించారు. చైనా స్టూడెంట్స్... సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో ఎలాంటి కోర్సులు చదవకుండా బిల్లును ప్రతిపాదిస్తున్నారు. హెచ్ 1 బి వీసాల్లో 15 శాతం వాటా చైనీయులదే. దీంతో చైనాను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు అమెరికా స్టూడెంట్స్‌ను అస్త్రంగా ఎంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: