ప్రజాస్వామ్యంలో మీడియాకు చాలా ప్రాధాన్యం ఉంది. దీన్ని అందుకే నాలుగో స్థంభం అంటారు. శానన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థలు మూడు స్థంభాలైతే.. మీడియా నాలుగో స్థంభం.. అయితే దురదృష్టవశాత్తూ కార్యనిర్వహక వ్యవస్థ పెత్తనమే అంతటా నడుస్తోంది. సాధారణంగా ప్రజాపక్షం ఉండాల్సిన మీడియా కూడా అధికారంలో ఉన్న పెద్దల ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేక.. జనం వైపు చూడటం తగ్గించేశాయి. 

 


ఈ పరిస్థితి తెలంగాణలో మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌ కు ఎదురన్నదే లేకుండా ఉంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు బలహీనంగా ఉన్నాయి. జనం కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగానే ఉన్నారు. అందుకే కేసీఆర్ సర్కారుతో పెట్టుకోవడం ఎందుకన్నట్టు ప్రధాన తెలుగు మీడియా కేసీఆర్ వ్యతిరేక వార్తలు, ప్రజల ఇబ్బందులు రాయాలంటే ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుంటున్నాయి. 

 


ఇలాంటి సమయంలో వీ6, వెలుగు దిన పత్రిక రెండూ ప్రజల ఇబ్బందులను, సర్కారు లోటుపాట్లను బాగా కవర్ చేస్తున్నాయి. నెంబర్ వన్ దిన పత్రికలు కూడా కేసీఆర్‌ కు కోపం వస్తుందని ఒక్క ముక్క కూడా నెగిటివ్ గా రాయకుండా భయపడుతుంటే.. చిన్న పత్రిక అయినా వెలుగు దిన పత్రిక మాత్రం ప్రభుత్వ లోటు పాట్లను ఏకిపారేస్తోంది. గురువారం  నాట పత్రికలో ఏకంగా సర్కారు నడవట్లే అంటూ బ్యానర్ వార్త ప్రచురించింది. 

 


ప్రభుత్వ యంత్రాంగమంతా సెక్రటేరియట్ షిఫ్టింగ్ లోనే మునిగిపోయిందని.. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఆఫీసర్లు ఎప్పుడు ఎక్కడ ఉంటరో కనుక్కోవడం ఎమ్మెల్యేలకు కూడా చాలెంజ్ గా మారిందని రాసింది. సీఎం ఆఫీసు, సెక్రటేరియట్, కమిషనరేట్స్, కలెక్టరేట్స్.. ఇట్ల  అంతటా ఇదే పరిస్థితి ఉందని..  కరోనా భయంతో కొందరు మినిస్టర్లు, ఆఫీసర్లు బయటకు రావడమే మానేశారని రాసింది.  కరోనా టైంలో తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలని జనం అడుగుతున్నారని నిలదీసింది. రోజుకో బ్యానర్ కథనంతో సర్కారు లోపాలు బయటపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: