భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాస్కు ధరించకుండా పబ్లిక్‌ ప్రదేశాల్లో తిరుగుతున్నవారికి ఇప్పటివరకు విధిస్తున్న రూ.100 జరిమానాను రూ.500లకు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇటీవల లాక్ డౌన్ సడలింపులు చేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.

 

దాంతో ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఈ  నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు నేటి నుంచే అమలులోకి వస్తామని, ముక్కును నోటిని కప్పి ఉంచుకోని వారికి వెంటనే జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అమిత్‌ మోహన్‌ పేర్కొన్నారు.

 

ప్రజలంతా మాస్కులు ధరించాలని, కరోనా నియంత్రణకు అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 38,066 శ్యాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 10,74,112మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలోని అలీఘర్‌, మురదాబాద్‌, బరేలీ, వారణాసి, గోండా, మీర్జాపూర్‌, లక్నోలోని బలరాంపూర్‌ హాస్పిటళ్లలో కొత్తగా ఆర్టీ-పీసీఆర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని శనివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వీటిని ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. కరోనా కేసుల విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: