కరడుగట్టిన నేరగాడు... యూపీ గ్యాంగ్ స్టర్‌... వికాస్‌ దుబే హతమయ్యాడు. 8 మంది పోలీసుల్ని పొట్టనపెట్టుకున్న నిందితుడు.. అదే పోలీసు తూటాలకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లో పట్టుబడిన దుండగుడు.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటరయ్యాడు.

 

ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను చంపి.. తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసులకు చిక్కిన కొన్ని గంటల్లోనే హతమయ్యాడు. గురువారం ఉజ్జయిన్‌ మహంకాళీ ఆలయంలో పట్టుబడిన ఈ ముఠా నాయకుడు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. 

 

వారం రోజుల క్రితం యూపీలో ఖాకీలపై విరుచుకుపడి ఘోర కలి సృష్టించిన వికాస్‌ దూబే... మధ్యప్రదేశ్‌ ఉజ్జయిన్‌ చేరుకున్నాడు. అక్కడి ప్రసిద్ధ మహాంకాళి ఆలయంలోకి వెళ్లిన దూబేను అక్కడి గార్డ్స్‌ సాయంతో పట్టుకున్నారు.. యూపీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఇక అక్కణ్నుంచి.. అతణ్ని తరలించే వరకు హైడ్రామా నడిచింది. 

 

సరిగ్గా ఉదయం ఏడు గంటలకు... ఉత్తర్‌ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. వికాస్ దూబేను కాన్పూర్‌కు తరలించేందుకు బయలుదేరారు. 13 కార్ల సాయుధ బలగాల కాన్వాయ్‌ మధ్య.. దూబేను కాన్పూర్‌కు తీసుకొస్తున్నారు. అదే సమయంలో జోరుగా వాన కురుస్తోంది. అప్పుడే.. కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. అందులోనే దూబే ప్రయాణిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన దుండగుడు..  ఓ పోలీసు తుపాకిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. లొంగిపోవాలన్న పోలీసుల ఆదేశాల్ని పట్టించుకోలేదు. పైగా పోలీసుల పైకే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపక తప్పలేదు.  

 

కారు బోల్తా పడ్డ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే అదనుగా తప్పించుకునే ప్రయత్నం చేసిన దూబేను.. మిగితా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, దుండగుడు కాల్పులకు తెగబడటంతో.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో కరుడుగట్టిన నేరస్థుడు.. కుప్పకూలిపోయాడు. వెంటనే అతణ్ని.. పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసులకు.. చికిత్స జరుగుతోంది. వారంతా మెల్లగా కోలుకుంటున్నారు.

 

ఇప్పటికే దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బౌవా దూబే గురువారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కార్తికేయను బుధవారం అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కాన్పుర్‌ తీసుకొస్తుండగా మార్గమధ్యంలో వెహికిల్‌ టైర్‌ పంక్చర్‌ అయ్యింది. ఇదే అదునుగా తప్పించుకునే ప్రయత్నం చేసిన కార్తికేయను.. ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ప్రవీణ్‌ను ఇటావా దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మొత్తానికి.. ఇప్పుడు దూబే హతం కావడంతో... బిక్రులో 8మంది పోలీసుల హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు చనిపోయారు. 

 

సరిగ్గా వారం క్రితం..  కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వస్తున్న పోలీసు బృందంపై ఆకస్మికంగా కాల్పులు జరిపి.. డీఎస్పీ సహా 8 మంది పోలీసులను బలితీసుకున్న దూబే.. అక్కణ్నుంచి పరారయ్యాడు. రాజస్థాన్‌లోని కోట మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హర్యానాలోని ఫరీదాబాద్‌ వెళ్లాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న దూబే... ఆ తర్వాత ఇద్దరు అనుచరులతో ఉజ్జయిన్‌ కు వచ్చాడు. ఎట్టకేలకు అక్కడ పట్టుబడినా.. మరోసారి తప్పించుకోబోయి ఎన్‌కౌంటరయ్యాడు. దూబేపై హత్యా నేరాలు సహా మొత్తం 60 క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మొత్తానికి ఈ కరుడుగట్టిన నేరగాడి కథ.. ఎన్‌కౌంటర్‌ రూపంలో ముగిసింది. తుపాకులతో ఆటలాడుకున్న వికాస్ దూబే.. ఆ తూటాలకే బలైపోయాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: