మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్‌ను సైతం కరోనా వదలడం లేదు..! లాక్‌డౌన్‌లో రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్‌శాఖ ఇప్పుడు కరోనా బారిన పడింది. ఇప్పటికే కరోనా బారిన పడి పోలీసులు మృతి చెందడం కలకలం రేపింది. అయితే, హైదరాబాద్‌లో వైరస్‌ను జయించి విజేతలుగా నిలిచారు కొందరు పోలీసులు. కరోనాను జయించి.. మళ్లీ విధుల్లో పాల్గొన్న పోలీసులు సమాజానికే ఆదర్శమన్నారు హైదరాబాద్‌ సీపీ.

 

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎవర్ని వదలడం లేదు.  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా నిలబడి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, శానిటైజేషన్‌ సిబ్బందిని కూడా కరోనా వెంటాడుతోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో కష్టపడిన పోలీసులు ఎక్కువ మందికి వైరస్‌ సోకింది. ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ఎక్కువ మంది పోలీసులు వైరస్‌ బారిన పడ్డారు. హైదరాబాద్‌లోనూ కరోనా మహమ్మారి పోలీసుల్ని వదల్లేదు.

 

డిపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో టెన్షన్‌ మొదలైంది. వైరస్‌ బారిన పడి కానిస్టేబుల్‌ దయాకర్‌ చనిపోవడంతో పోలీస్‌ శాఖలో మొదటి మరణం నమోదవ్వడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. సిబ్బందిని హెల్త్‌ ప్రొటోకాల్‌ ఫాలో కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంత మంది సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత వీరు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో పోలీసుల్లో ఆత్మవిశ్వాసం మొదలైంది. అంతే కాకుండా వైరస్‌ను జయించిన వారు తిరిగి పోలీస్‌ విధుల్లో చేరారు.

 

వైరస్‌ను జయించిన పోలీసుల్ని తిరిగి విధుల్లోకి ఆహ్వానించారు ఉన్నాతాధికారులు. స్వయంగా నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వారికి వెల్‌కమ్‌ చెప్పడంతో, సిబ్బందికి కొండంత ధైర్యం వచ్చింది. కరోనాను జయించిన పోలీసులకు సెల్యూట్ చేశారు అంజనీకుమార్‌. ఇతర నగరాలతో పోలీస్తే హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు. హైదరాబాద్‌లో మరణాల శాతం కూడా తక్కువగా ఉందన్నారు. కరోనా వచ్చినప్పుడు కుటుంబసభ్యులు, అధికారులు చెప్పిన ధైర్యంతో కోలుకున్నామన్నారు సిబ్బంది. ధైర్యంగా ఉంటే కరోనాను ఎదుర్కొవచ్చాని తెలిపారు. 

                

మరింత సమాచారం తెలుసుకోండి: