ఏపీ సీఎంగా జగన్ ఎన్నికైన మొదట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనతో చాలా ప్రేమపూర్వకంగా ఉండేవారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరై.. పెద్దన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు పలుసార్లు భేటీ అయ్యి కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగం వంటి విషయాలపై చర్చించారు. ఇద్దరు సీఎంలు కలసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయని నిరూపించారు. 

 


అయితే కొన్నాళ్లుగా కేసీఆర్, జగన్ మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. మళ్లీ జలవివాదాలు మొదలవుతున్నాయి. మొన్నటికి మొన్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వేడి పెంచింది. టైబ్యునళ్లలో ఫిర్యాదుల వరకూ విషయం వెళ్లింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీటవుతోంది. గోదావరిలో లభ్యమయ్యే నికరజలాల్లో తెలంగాణ కంటే తమకే ఎక్కువ వినియోగం ఉందని.. అది కూడా అధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులకే అంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడం విబేధాలను మళ్లీ బయటపెట్టింది. 

 

 

2014 జనవరిలో... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో గోదావరి బేసిన్‌లోని 1,480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 967.14 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా నివేదించారు. కానీ తాజాగా ఏపీ రాసిన లేఖలో 650 టీఎంసీలుగానే చెబుతోంది. ఇది  నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్‌లోనే కాక ఎక్కువ లభ్యత ఉండే గోదావరిలో కూడా కొత్త వివాదానికి తెరలేపుతోంది. 

 


అంతే కాదు.. గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం జరగలేదని గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్నందున తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బోర్డు ఆధీనంలో ఉండాలని ఏపీ అంటోంది. గోదావరి జలవివాద టైబ్యునల్‌ ప్రకారం శ్రీరామసాగర్‌ , నిజాంసాగర్‌లకు నీరొచ్చేలా చూడటానికి మహారాష్ట్ర, కేంద్ర జల వనరుల శాఖకు విన్నవించాలని..., శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు దిగువన ప్రధాన గోదావరి నుంచి ఎత్తిపోయడానికి వీల్లేదని ఏపీ బోర్డుకు రాసింది. అంతే కాదు..  కొత్త ప్రాజెక్టుల నివేదికలను తెలంగాణ గోదావరి బోర్డుకు ఇవ్వాలని అంటోంది. మరి ఈ కొత్త వివాదం ఎలా పరిష్కారమవుతుందో..? 

మరింత సమాచారం తెలుసుకోండి: