ఏపీలో కొత్త జిల్లాలు గురించి గత కొంత కాలంగా చర్చ సాగుతోంది. ఇందులో ప్లస్సులు మైనస్సులు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటిదాకా విపక్షం నుంచి పెద్దగా సూచనలు, విమర్శలు లేకపోయినా అధికార వైసీపీలోనే కొత్త జిల్లాల మీద భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనలు వస్తున్నాయి.

 

ఇక కొత్త జిల్లాలు అంటేనే తేనే తుట్టెను కదపడం. రాష్ట్ర విభజన విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. సరైన విధంగా సహేతుకంగా ఏపీ విభజన సాగలేదన్న భావన ఇప్పటికీ ఉంది. ఆస్తులన్నీ ఒకవైపు, అప్పులన్నీ మరో వైపు నెట్టారని కూడా ఇప్పటికీ మేధావులు అంటారు.

 

సరే విభజన తేనేతుట్టె కదిపి కాంగ్రెస్ ఎంత బావుకుందో కూడా  తెలిసిందే. ఇక ఇపుడు రాష్ట్రాల్లో జిల్లాలు కూడా అలాంటివే. వాటికి పేరు దగ్గర నుంచి ప్రతీదీ సెంటిమెంటే. ఇపుడు ఉన్న భౌగోళిక స్వరూపం మార్చడానికి కూడా చాలా మంది ఒప్పుకోరు. అయితే కొత్త జిల్లాలు ఎక్కడ నుంచో ఎగురుకుంటూ రావు. అవి ఉన్న వాటినే ముక్కలు చేస్తే వస్తాయి.

 

అలా ముక్కలు చేసినపుడు అభివ్రుధ్ధి చెందిన ప్రాంతం కొత్త జిల్లాలలోకి  పోయిందనో లేదా వేరే జిల్లాకు వెళ్ళిందనో విమర్శలు వెల్లువెత్తుతాయి. అంతదాకా ఎందుకు శ్రీకాకుళం జిల్లాలోని  పాలకొండ, ఎచ్చెర్లలను విడదీసి విజయనగరంలో కలపడానికేనా ఈ కొత్త జిల్లాల  విభజన అంటూ ఏకంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గట్టిగానే తగులుకుంటున్నారు. 

 


పార్లమెంట్ సీట్ల పరంగా చూసుకుంటే అవి విజయనగరం జిల్లాలో ఉన్నాయి. దాంతో సహేతుకత ఏముందని ఆయన అంటున్నారు. ఇదే తీరున అరకు పార్లమెంట్ చేస్తామంటే ఎక్కడో  శ్రీకాకుళంలో ఉన్న సీతంపేటను తెచ్చి  అందులో కలిపితే బహుదూరం  అంటున్నారు. ఈ రకంగా కొత్త చిచ్చు రగులుతోంది. పైగా పేద రాష్ట్రమైన ఏపీకి కొత్త జిల్లాలు భారమే తప్ప వేరే ఉపయోగం లేదన్న మాటా ఇపుడు  ఉంది. దాంతో అన్నీ ఆలోచిస్తున్న జగన్ ప్రస్తుతానికి కొత్త జిల్లాలు అన్న మాట లేకుండానే పాలన చేద్దామనుకుంటున్నారని టాక్. అదే జరిగితే కొత్త జిల్లాల పేరిట రాజకీయం చేద్దామనుకుంటున్న వారికి భారీ షాకే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: