కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు వ్య‌వ‌హారం అక్క‌డి ముఖ్య‌మంత్రి విస‌ర‌యికి త‌ల‌పోటుగా ప‌రిణ‌మించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుప‌డుతున్నాయి. బంగారం స్మగ్లింగ్ చేసే వారిని ముఖ్యమంత్రి కార్యాలయం రక్షించాలని చూస్తోందంటూ మండిపడ్డాయి. ఇప్ప‌టికే  ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు.


దీంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం మ‌రింత వేడి ర‌గులుకున్న‌ట్ల‌యింది. ఇదిలా ఉండ‌గా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్‌ను కేరళ ప్రభుత్వం కావాలనే ఐటీశాఖ‌లో కీల‌కమైన ప‌ద‌విలో  నియమించిందని ఆరోపిస్తున్నారు. ఆమెను నియమించవద్దని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్న సురేశ్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. 


వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎలాంటి విచార‌ణ‌నైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. అంతేకాక గురువారం కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ ల్డ్‌ స్మగ్లింగ్‌ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని తెలిపింది. అయితే ఈ వ్య‌వ‌హారం రోజురోజుకు రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ప్ర‌తిప‌క్షాలు దీన్నే ప్ర‌ధాన అంశంగా తీసుకుని ఆందోళ‌న చేపడుతుండ‌టం గ‌మ‌నార్హం. అందులో భాగంగానే శుక్ర‌వారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం కోజికోడ్‌లో యూత్ లీగ్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ  చేశారు. ఈ ఘర్షణలో చాలా మంది నిరసనకారులకు గాయలయ్యాయి. కొచ్చిలో కూడా యువకుల నిరసన హింసాత్మకంగా మారింది. కన్నూర్‌లో పోలీసులు ఆందోళనకారులను నియంత్రించడానికి టియర్‌గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: