భారతీయులపై చైనా సైబర్ అస్త్రాన్ని ప్రయోగిస్తోందా? గల్వాన్ ఘర్షణ తర్వాత సైబర్ దాడులు పెరగడం వెనక కారణమేంటి? చైనాకు చెందిన 59 యాప్​లపై నిషేధం విధించిన అనంతరం భారతీయులను లక్ష్యంగా చేసుకుందా? ఇవన్నీ ఎంతవరకు నిజం?

 

భారత్​లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా విపత్తు భయాలను సొమ్ము చేసుకుంటున్నారు. వైరస్​ పేరు చెప్పి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తూనే ఉన్న ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇంటర్నెట్ వినియోగదారులకు సైబర్ దాడుల గురించి అవగాహన కల్పించింది. ఉచిక కరోనా పరీక్షలు అంటు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని సూచించింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే లద్దాఖ్​లో హింసాత్మక ఘర్షణ జరిగిన వారం రోజుల తర్వాత(జూన్ 21న) ప్రభుత్వం ఈ సూచనలు జారీ చేసింది. దీంతో చైనీస్ హ్యాకర్లు భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు కలిగాయి.

 

అయితే దీనికి కారణం చైనాతో ఉద్రిక్తతలు కాదని నిపుణులు స్పష్టం చేశారు. సరైన భద్రత లేని పరికరాలు వాడటం, వర్క్​ ఫ్రం హోమ్​ పెరగడం వల్లే సైబర్ దాడులు అధికమైనట్లు తెలిపారు.

 

గత రెండు నెలల్లో సైబర్ దాడులు పెరగడం వాస్తవమే. దాదాపు 200 శాతం పెరిగాయని తెలుస్తోంది. ఫిషింగ్, విషింగ్, ర్యాన్సమ్​వేర్.. అన్ని కేసులు పెరిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్లే సమస్య వచ్చిందనే అభిప్రాయం ఉంది. కానీ, మే ప్రారంభంలో సరిహద్దు ఉద్రిక్తతలకు ముందే సైబర్ దాడులు ఎక్కువయ్యాయి. జనవరి, ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి.


ఇరుదేశాల ఉద్రిక్తతల వల్ల కేసులు పెరిగాయనేందుకు ఎలాంటి కారణం లేదని తెలిపారు గుల్షన్. ఇంటి నుంచి పనిచేస్తున్న వారే ఎక్కువగా సైబర్​ దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వైరస్​ను కట్టడి చేసేందుకు కొన్ని సంస్థలు లాక్​డౌన్​కు ముందే ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే కొన్ని సైబర్ దాడులు భారత్​, చైనా ఉద్రిక్తతల కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: