లాక్ డౌన్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సామాన్య ప్రజలతో మొదలుకుని ఉద్యోగుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4 నెలల లాక్ డౌన్ తో చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. చేసే చిన్న ఉద్యోగంలో జీతాలు రాక, డబ్బులు సరిపోక కొందరు చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.  సామాన్య ప్రజలకే కుటుంబ భారం అనుకుంటే.. ఓ న్యాయవాది వాదించడానికి  కేసులు లేక తాను పనిచేసే కోర్టు ఎదుటే కూరగాయలు అమ్ముకుంటున్నాడు.

 


కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి పొందే వారిపై మోయలేని భారం మోపింది. అనేక మంది ఉపాధి కోల్పోయి పడరాని పాట్లు పడుతున్నారు.  ప్రైవేట్ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన పలువురు ఇప్పటికే ఉపాధి లేక కొందరు మాస్కులు అమ్మడం, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు. ఓ దర్శకుడు ఏకంగా కిరాణం షాపే పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా ఓ న్యాయవాది తాను పనిచేసే హైకోర్టు ఎదుట కూరగాయలు  అమ్ముతున్నాడు. 

 


ఒడిశా హైకోర్టుకు చెందిన న్యాయవాది సపన్ పాల్ కరోనా కారణంగా కేసులు లేక ఇంటికే పరిమితమయ్యాడు. 
కేసులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. బార్ కౌన్సిల్ ప్రకటించిన రిలీఫ్ ఫండ్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సాయం చేసింది కానీ న్యాయవాదుల గురించి ఆలోచించలేదని సపన్ పాల్ చెప్పుకొచ్చారు.

 


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించేందుకు ఎలాంటి ఆదాయం లేదని, ఇంట్లో సరుకులు ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించాడు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదని స్పష్టం చేశాడు. చేసేదేమి లేక కుటుంబ పోషణ భారమై ఇదిగో ఇలా కూరగాయలు అమ్ముకుంటున్నానని చెప్పుకొచ్చారు. కేంద్రం న్యాయవాదులను ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: