చైనా యాప్స్ నిషేధంతో ఒక్కసారిగా ఢమాల్ అంటూ ఆదాయం కోల్పోయిన టిక్‌టాక్ కొత్త ఎత్తులు వేస్తోంది. బీజింగ్‌లో ఉండడం వల్లే తమపై నిషేధం పడిందని భావిస్తున్న ఆ సంస్థ.. వేరే దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉండడం కంటే తమ మనుగడ ముఖ్యమని ఆఫీసును తరలించే ప్లాన్‌లు చేస్తోంది..!

 

భారత్ టిక్‌టాక్‌ను నిషేధించడంతో కోట్ల మంది యూజర్లను కోల్పోయి.. తీవ్ర నష్టాలను చవిచూసింది టిక్‌టాక్‌. తాజాగా అమెరికా కూడా నిషేధించే యోచనలో ఉందన్న వార్తలతో అప్రమత్తమైంది ఆ సంస్థ. తమది చైనా యాప్ అయినప్పటికీ.. పక్షపాతంగా వ్యవహరించలేదని, ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని ఇప్పటికే ప్రకటించిన టిక్‌టాక్.. ఆ ఆరోపణల నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా కూడా నిషేధిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో కొత్త పల్లవిని అందుకుంది. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది.

 

బీజింగ్‌ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని భావిస్తోంది టిక్‌టాక్‌. అంతేకాదు, కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో బైట్‌డ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా.. చైనా ముద్రను తొలగించుకోవాలన్నది టిక్‌టాక్‌ భావిస్తోంది. ఇండియా బ్యాన్‌ చేసిన టిక్‌టాక్, హెలో యాప్‌లు రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ. ఈ రెండు యాప్‌లు నడవాలంటే చైనాకు దూరంగా ఉండాల్సిందేనని భావిస్తోంది. 

 

మరోవైపు.. నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌తో పాటు టిక్‌టాక్‌కు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను పంపింది భారత్. జూలై 22 లోపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే.. 59 యాప్స్‌ను శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరించింది కేంద్రం. ఈ యాప్స్ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి, గ్లోబల్ సైబర్ వాచ్‌డాగ్స్ నుంచి భారత్ ఇప్పటికే డేటా తెప్పించుకుంది.

 

సదరు యాప్స్ స్పందనకు, తెప్పించుకున్న డేటాకు పొంతన సరిపోయిందో లేదో పోల్చి చూడనుంది భారత్. ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా.. ఈ యాప్స్ భారత్‌లో మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. యాప్స్ కార్పొరేట్ మూలాలు, మాతృ సంస్థల నిర్మాణం, నిధులు, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ సర్వర్లకు సంబంధించి చైనీస్ యాప్స్‌కు పంపిన ఆ 79 ప్రశ్నల్లో భారత్ ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: