భార‌త‌దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు కేసుల క‌ల‌క‌లం కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు దేశంలో క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో కీల‌క వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.  కొవిడ్‌కు టీకా వచ్చే ఏడాది ప్రారంభంలోనే వస్తుందని కరోనాపై కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తలు తెలిపారు. మ‌రోవైపు, దేశంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా వ్యాప్తిని నిలువరించడాన్ని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ధారావీలో కరోనా కట్టడికి చేసిన ప్రయత్నాల కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతం ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి బయపడే దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయెసిస్‌ అన్నారు.

 

 

కరోనాపై కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయీ సంఘానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘంలో భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, బయోటెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తల బృందం స‌భ్యులుగా ఉన్నారు. వీరికి కరోనా నివారణ, ప్రభుత్వ సన్నద్ధత, టీకా తయారీపై సంఘానికి వివరించింది. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ స్థాయీ సంఘానికి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఈ ఏడాది టీకా వ‌చ్చే చాన్స్ లేద‌ని తేల్చిచెప్పింది. 

 

 

ఇదిలాఉండ‌గా, ధార‌వి విష‌యంలో ప‌లు కీల‌క విష‌యాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. జూన్‌ నెలలో ధారవి కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్నది. కానీ జూలైన నెలలో కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.ధారావిలో జూన్‌ నెలలో సరాసరి రోజుకు 18 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1న అత్యధికంగా 34 కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే జూలై వచ్చేనాటికి కరోనా కేసులు క్రమంగా తగ్గిపోయాయి. జూలై 8న మూడు కేసులు నమోదవగా, జూలై 9న తొమ్మిది, ప‌దో తేదీన‌ పదకొండు నమోదయ్యాయి. ఈ మురికివాడలో ఇప్పటివరకు 2359 పాజిటివ్‌ కేసులు నమోదవగా, అందులో 166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాధి సోకిన వారికి తక్షణమే చికిత్స అందిస్తున్న కారణంగా కరోనా యుద్ధంలో ధారావి విజయం సాధించిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయెసిస్ ప్ర‌శంసించారు. కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, దాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని, ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా, ధారావీలు దీనికి నిదర్శణమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: