కరోనా కాలంలో ఉల్లి రైతుకు మరో కష్టం వచ్చి పడింది. అన్ని వ్యాపారాలు పడిపోయినట్లే ఉల్లి వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయింది. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. కొనుగోలుదారులు లేక ఉల్లి మార్కెట్లు కళతప్పి కనపడుతున్నాయి‌.

 

మొన్నటిదాకా వినియోగదారుడిని కన్నీరు పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు దాన్ని పండించిన రైతును కన్నీరు పెట్టిస్తోంది. గత నెలరోజుల నుంచి ఉల్లిధరలు భారీగా పడిపోతున్నాయి‌. రెండు నెలల క్రితం వరకు కిలో ఉల్లిగడ్డ 40 నుంచి 50 రూపాయలు పలికితే ప్రస్తుతం అది కాస్తా 10 నుంచి 15 రూపాయలకు పడి పోయింది. 

 

నిజానికి ఉల్లి ధరలను కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చూడాల్సి వస్తోంది. కరోనాకు ముందు అంటే మూడు నెలల క్రితం ఉల్లిగడ్డకు విపరీతమైన డిమాండ్‌. హోటళ్లు, మెస్‌లు, క్లబ్బులు, ధాబాలు ఇలా అన్నింటా ఉల్లి వినియోగం తప్పనిసరి. కానీ, ప్రస్తుతం అవి ఓపెన్‌ కాకపోవడంతో ఉల్లిధరలు పూర్తిగా పడిపోయాయి. 

 

హైదరాబాద్‌లోనే రోజుకు 8 నుంచి 12 వేల టన్నుల ఉల్లి వినియోగం అవుతున్నట్టు మార్కెట్ వర్గాల అంచనా. మహారాష్ట్రతో పాటు కర్నాటక, తెలలంగాణ జిల్లాల నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లిలో 60 నుంచి 70శాతం హోటల్‌ వ్యాపారులే వినియోగిస్తుంటారు. మిగిలిన 30శాతం రోజువారీగా వినియోగదారులు కొనుగోలుచేస్తుంటారు. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌ తొలగించినా హోటళ్లు తెరుచుకోకపోవడం, పార్శిల్‌లకు ఆదరణ లేకపోవడంతో మార్కెట్‌లో భారీగా ఉల్లి నిల్వలు పెరిగిపోతున్నాయ్‌. సాధారణ వినియోగ దారులు ఎంత కొన్నా టన్నుల కొద్ది ఉల్లి నిల్వలు తరిగే ప్రసక్తే లేదు. దీంతో ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి 6 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక, రిటైల్‌ వ్యాపారులు కిలో 10 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. 

 

ఒకప్పుడు ఉల్లికి మంచి ధర మార్కెట్ లో ఉండేది. దాంతో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు రైతులు. అయితే, ప్రస్తుతం మాత్రం వేసిన పంటకు కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: