దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి నానాటికీ పెరుగుతోంది. కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఇలాంటి త‌రుణంలో అంద‌రిలో టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నెల 10లోగా పాలసీని అందుబాటులోకి తేవాలని బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే. స్వల్పకాలిక కరోనా కవచ్‌ ఆరోగ్య బీమా పాలసీని 29 జనరల్‌, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. కరోనా వైరస్‌ చికిత్స ఖర్చులు బాధితులకు భారం కాకుండా ఈ పాలసీలను రూపొందించారు. ప్రీమియం శ్రేణి రూ.447-5,630గా ఉన్నది. జీఎస్టీ అదనమని బీమా సంస్థలు పేర్కొన్నాయి. 

 

ఎస్‌బీఐ, నేషనల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌, మ్యాక్స్‌ బూపా, టాటా, భారతీ, ఓరియంటల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితర సంస్థలు కరోనా కవచ్‌ పాలసీని ప్రకటించాయి. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలవ్యవధితో ఈ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తాయి. కనీస బీమా రూ.50 వేలు, గరిష్ఠ బీమా రూ.5 లక్షలు (రూ.50 వేల చొప్పున)గా ఉన్నది. ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.

 


త‌మ పాల‌సీ గురించి బజాజ్‌ అలియాంజ్ వివ‌రిస్తూ, బీమా కవరేజీ ఆధారంగా ప్రీమియం ధర కనిష్ఠంగా రూ.447, గరిష్ఠంగా రూ.5,630గా ఉంద‌ని తెలిపింది. వీటికి వస్తు, సేవల పన్ను అదనమ‌ని పేర్కొంది.  వ్యక్తుల వయసు, కాలపరిమితి ఆధారంగా కూడా ప్రీమియంలలో మార్పులుంటాయని వివ‌రించింది. 35 ఏళ్ల లోపు వయసున్నవారు మూడున్నర నెలలకుగాను రూ.50 వేల పాలసీని తీసుకుంటే ప్రీమి యం రూ.447గా ఉంటుందని పేర్కొంది. అలాగే ఆస్పత్రి డైలీ క్యాష్‌ సదుపాయం కోసం ప్రీమియం రూ.3 నుంచి 620గా ఉంటుంద‌ని వెల్ల‌డించింది. 


హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో త‌మ పాల‌సీ గురించి వివ‌రిస్తూ ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) చికిత్సలు, ఔషధాల వ్యయాన్నీ బాధితులకు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. 14 రోజుల క్వారంటైన్‌లో భాగంగా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్న ఖర్చులను కూడా  త‌మ పాలసీలో పొందవచ్చని పేర్కొంది. ప్రభుత్వ అధీకృత డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో పాజిటివ్‌ అని తేలి ఆస్పత్రుల్లో చేరినవారి వైద్య ఖర్చులు పాలసీలో వర్తిస్తాయని వెల్ల‌డించింది. కరోనా వైరస్‌ చికిత్స తీసుకుంటున్న రోగులకు ఇచ్చే ఇతర అనారోగ్య చికిత్సలకు కూడా పాలసీలో కవరేజీ ఉంటుందని, ఆస్పత్రికి వెళ్లేందుకు అవసరమైతే అంబులెన్స్‌ సేవలకూ చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దేశంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో పాల‌సీల ఆవ‌శ్య‌క‌త ఎంతో ఉంది. స్వ‌ల్ప మొత్తం చెల్లించి తీసుకునే ఈ పాల‌సీల‌తో కోవిడ్ స‌మ‌స్య‌ల‌ను ఒకింత ఎదుర్కోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: