వరల్డ్‌ టాప్‌-20 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను నిలపడం, అప్పుల్లేని సంస్థగా నిలపడమే నా లక్ష్యం. ఇది ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఒకప్పుడు చెప్పిన మాట. చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ వాటినన్నింటినీ సుసాధ్యం చేస్తున్నారు ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్‌.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట్ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నారు. వారెన్ బఫెట్‌ను దాటడం ద్వారా ముఖేష్ అంబానీ ఈ ఘనతను సాధించారని ప్రకటించింది బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 68 పాయింట్ 3 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్ సంపద 67 పాయింట్ 9 బిలియన్ డాలర్లు అని తెలిపింది బ్లూంబర్గ్. 

 

2020 ఏడాదిలో ప్రపంచమంతా వైరస్ దెబ్బకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం 21.63 శాతం వృద్ధి చెందాయి. అలాగే జియో ప్లాట్ ఫాంలో 25.09 శాతం షేర్లను విక్రయించడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులను పొందింది రిలయన్స్ ఇండస్ట్రీస్. జియో ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్ ముబదాలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ క్యాపిటల్, ఎల్ కాటర్‌టన్, పీఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ వంటి సంస్థలు జియోలో వాటాలను కొనుగోలు చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం పెరిగిపోయింది.

 

2021 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు లేని సంస్థగా మార్చాలని ముఖేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని కూడా టార్గెట్ కంటే ముందే నెరవేరనుంది. తాజాగా జియో- బీపీ జాయింట్ వెంచర్ ద్వారా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను కూడా సంపాదించింది. ఈ జాయింట్ వెంచర్ భారత్‌లో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనుంది. రాబోయే రోజుల్లో పెరగనున్న చమురు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ జాయింట్ వెంచర్ ప్రారంభమైంది.

 

మొత్తం మీద.. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితాలో ఆసియా నుంచి చోటు సాధించిన ఒకే ఒక్క వ్యాపారవేత్తగా ముఖేష్ అంబానీ నిలిచారు. అయితే, వారెన్ బఫెట్ ఆదాయం కరోనా వల్ల తగ్గలేదు. బఫెట్ తన ఆస్తుల్లో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సేవా సంస్థలకు దానం చేశారు. దీంతో ఆయన సంపద కొంచెం తగ్గింది. బెర్క్ షైర్ హాత్వేలో 2006 నుంచి 37 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఆయన సేవాసంస్థలకు ఇచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: