చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశం మినహా ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 1,813 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,235కు చేరింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,278 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరింది. అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల తాజా నిబంధనలు సామాన్య, మధ్యతరగతి ప్రజల పాలిట శాపంగా మారాయి. బెడ్ల కొరత వల్ల తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్న రోగులు హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. 
 
సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవడం సాధ్యం కాదు. ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స చేయించుకోవడంలో సామాన్య, మధ్య తరగతి వర్గాలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో, రోగులకు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు. 
 
జగన్, కేసీఆర్ రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని భారీ కరోనా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వీటి అవసరం ప్రజలకు ఎంతో ఉంది. చాలామంది కరోనా సోకిందని తెలిసిన వెంటనే మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మానసిక వైద్య నిపుణుల ద్వారా రోగులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జగన్, కేసీఆర్ ఈ అంశాలపై దృష్టి పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: