కేరళలో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ  దర్యాప్తు కొనసాగుతోంది. ఈ  వ్యవహారంలో ఇప్పటికే నలుగురిపై  కేసు నమోదైంది. ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్, మరికొందరి పేర్లను కేసులో చేర్చిన ఎన్ఐఏ అధికారులు...వారి ప్రమేయంపై విచారణ చేపట్టారు. యూఏఈ కాన్సులేట్‌కు చెందిన  పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది.

 

కేరళలో రాజకీయ దుమారం రేపుతోన్న బంగారం అక్రమ రవాణా కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో  దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్ఐఏకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని గత శనివారం తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్లమాటిక్ కార్గో ద్వారా యూఏఈ కాన్సులేట్ చిరునామాతో ఈ బంగారం రావడంతో   స్మగ్లింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు తీవ్రమైన విఘాతం కలిగిస్తోందని  హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

 

చట్టవిరుద్దమైన కార్యకలాపాల నిషేధిత చట్టం 2004లోని ఉగ్రవాద చట్టం, ఉగ్రవాదులకు నిధులకు సంబంధించిన సెక్షన్ల కింద ఎన్‌ఐఏ కేసు నమోదుచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాలకు సంబంధం ఉందా? దీని వల్ల జాతీయ భద్రత, ఆర్ధిక అంశాలను ప్రభావితం చేసిందా అనే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు సాగుతోంది.

 

బంగారం అక్రమ రవాణా కేసులో యూఏఈ కాన్సులెట్ మాజీ ఉద్యోగి స్వప్నా సురేశ్ ప్రమేయం ఉండటం  సంచలనం సృష్టించింది. ఆమె అక్కడ పనిచేసిన సమయంలో తరచుగా  రాజకీయ, అధికార వర్గాలను కలిసినట్టు తెలుస్తోంది.  కేరళ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి  ఆమెతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో శివకుమార్ ను ఆ పదవి నుంచి తొలగించారు.

 

ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్నా సురేశ్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. యుఎఈ కాన్సులేట్-జనరల్ ఆఫీసులోని సీనియర్ దౌత్యవేత్త రషీద్ ఖామిస్ అల్ షమెలీ ఆదేశాలతోనే పార్శిల్‌కు సంబంధించి విమానాశ్రయ అధికారిని సంప్రదించినట్లు తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది. వర్క్ ఆన్ రిక్వెస్ట్ ప్రాతిపదికన కాన్సులేట్‌‌తో కలిసి పనిచేస్తున్నానని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: