జగన్ తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఆయన తక్కువ మాట్లాడి తన పనితనం ఎక్కువ  కనిపించాలనుకునే పెద్ద మనిషి. అయితే వైసీపీలో అంతా అలాగే ఉంటున్నారా అంటే చాలా మంది మాటల్లోనే చెలరేగిపోతూంటారు. అయిన దానికి కాని దానికి ఎదుటి వారికి గిల్లి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్ల నో యూజ్ అని తెలిసినా కూడా ట్విట్టర్ ఉంది కదా అని ట్వీటే వారి వల్లనే జగన్ సర్కార్ కి చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు.

 

వైసీపీలో కీలకమైన నేత విజయసాయిరెడ్డి. ఆయనకు ఎన్నో బాధ్యతలు జగన్ అప్పగించారు. నిజానికి వాటిని చూస్తే కనుక విజయసాయిరెడ్డికి అసలు ఊపిరే సలపదు. ఇక విజయసాయిరెడ్డిది ఎంత పెద్ద హోదావో తెలిస్తే  అంతా ఆశ్చర్యపోతారు. లోక్ సభ, రాజ్యసభ కలుపుకుని వైసీపీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీ లోక్ సభలో అతి పెద్ద నాలుగవ పార్టీ. రాజ్య‌సభలో ఆరవ పార్టీ. ఇంత పెద్ద పార్టీకి ఆయన పార్లమెంటరీ నాయకుడు.

 

ఇక విజయసాయిరెడ్డి అనేక పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. ఒకదానికి చైర్మన్ గా ఉన్నారు. ఇక వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా  జగన్ తరువాత అంత స్థాయిలో పార్టీలో ఉన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా కూడా ఆయన ఉన్నారు. 

 

అటువంటి విజయసాయిరెడ్డి ట్వీట్లు బాగా వేస్తారు రోజుకు కనీసం అర డజన్ అయినా అయనవి ఉంటాయి. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఎక్కువగా ట్వీట్లు వేస్తారు. అయితే ఇటీవల కాలంలో శ్రుతి మించి రాగాన పడుతోంది వ్యవహారం అంటున్నారంతా. విజయసాయిరెడ్డి ట్వీట్లతో కొంత మొరటుదనం వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి ట్వీట్లు వేసి రెండు అంటే అవతల టీడీపీ వారు నాలుగు ఆయన్నే కాక జగన్ని కూడా అంటున్నారు. దీంతో జగన్ అనవసరంగా ఇబ్బందులో పడుతున్నారు. 

 

ఇదిలా ఉండగా బీజేపీని కూడా ఈ మధ్య ఆయన కెలుకుతున్నారు. దీంతో ఏకంగా  కన్నా లక్షీనారాయణ జగన్ కి లేఖ రాశారు. మా పార్టీ వ్యవహారాల్లో సాయిరెడ్డి జోక్యం ఏంటి అంటూ కన్నా ఘాటుగానే లేఖ ప్రయోగించారు. మొత్తానికి రాజకీయ విమర్శలు వద్దు అని ఎవరూ అనరు కానీ సాయిరెడ్డి మరీ తన హోదాను, అనుభవాన్ని మరచి వేస్తున్న కొన్ని ట్వీట్లతో వైసీపీకే ఇబ్బందులు కొత్త తలనొప్పులు అంటున్నారు. అది ఆయన గమనిస్తే మంచిదేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: